Mar 09,2023 23:46

సీతమ్మ పాడె మోస్తున్న ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు

పోలీసుల ఆధ్వర్యాన అంత్యక్రియలు
ప్రజాశక్తి -సీలేరు

మావోయిస్టు పార్టీ నాయకుడు కాకూరు పండన్న అలియాస్‌ జగన్‌ తల్లి కాకూరు సీతమ్మ (80) గురువారం ఉదయం జీకే వీధి మండలం, దుప్పిలివాడ పంచాయతీ కొమ్ములవాడ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామస్తులు, సీతమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సీలేరు ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో కొమ్ములవాడ వెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సీతమ్మ పాడెను ఎస్‌ఐ రామకృష్ణ, కానిస్టేబుల్‌ పడాల్‌ మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.10వేలు సీతమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు.
కొమ్ములవాడ గ్రామానికి చెందిన కాకూరు పండన్న అలియాస్‌ జగన్‌ మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై చిన్నతనంలోనే దళంలో చేరి సుమారు 30 సంవత్సరాలు గడుస్తుంది. ప్రస్తుతం జగన్‌ ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్పెషల్‌ జోనల్‌ కమిటీ నాయకుడిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. జగన్‌ తల్లి సీతమ్మకు ఆరుగురు సంతానం. ఇందులో ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. చిన్న కుమారుడు జగన్‌ మావోయిస్టు దళంలో చేరగా, పెద్ద కుమారుడు కొంత కాలం క్రితం అకాల మరణం చెందారు. ఆడపిల్లలు వారి వారి అత్తవారి ఇళ్ల వద్ద ఉంటున్నారు. దీంతో సీతమ్మ ఒంటరిగా ఉండేది. ఆమె అలనా పాలనా చేసే వాళ్లు లేకపోవడంతో సీతమ్మ కుమారుడు జగన్‌పై బెంగపెట్టుకొని అనారోగ్యానికి గురైంది. ఇటీవల సిఆర్‌పిఎఫ్‌ 42వ బెటాలియన్‌ సివిక్‌ యాక్షన్‌ ప్రోగ్రాం గొర్రెలోవలో నిర్వహించారు. ఈ క్రమంలో జగన్‌ తల్లి సీతమ్మ అనారోగ్యంతో ఉందని తెలుసుకున్న జికె.వీధి సిఐ అశోక్‌ కుమార్‌, ఎస్సై రామకృష్ణ, సిఆర్‌పిఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ సురేష్‌ కొమ్ములవాడ వెళ్లి సీతమ్మను పరామర్శించారు. స్థానిక వైద్యాధికారి సౌమ్యతో వైద్య సేవలు అందించి, వంట సరుకులు, రగ్గు అందించారు. ఈ నేపథ్యంలో జగన్‌ మావోయిస్టు దళం నుంచి బయటికొచ్చి తన చెంతకు రావాలని పోలీసుల ద్వారా సీతమ్మ మొరపెట్టుకుంది.
జగన్‌ కోసం పోలీసుల నిఘా
తల్లి సీతమ్మ మృతి చెందడంతో ఆమె అంత్యక్రియలకు కుమారుడు జగన్‌ వస్తాడని భావించి పోలీసులు నిఘా పెట్టారు. జగన్‌ జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసుల అనేకసార్లు పిలుపునిచ్చారు. తల్లి ద్వారా విజ్ఞప్తి చేయించారు. అయినా ఆయన జనజీవనం స్రవంతిలోకి రాకపోవడంతో పోలీసులకు జగన్‌ సవాల్‌గా మారాడు. కనీసం తల్లి అంత్యక్రియలకైనా హాజరవుతాడేమోనని పోలీసులు భావించి నిఘా పెట్టారు.