Mar 04,2023 00:20

కేసు వివరాలు వెల్లడిస్తున్న భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్‌పి వినీత్‌

ప్రజాశక్తి-చింతూరు
తెలంగాణ- చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ రాష్ట్రం పైడిగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు పామేడు దళం సభ్యులను, ఒకరు సానుభూతిపరుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్‌పి జి.వినీత్‌ శుక్రవారం కేసు వివరాలను మీడియాకు తెలియజేశారు. ఎస్‌పి కథనం ప్రకారం... పైడిగూడెం అటవీ ప్రాంతంలో దుమ్ముగూడెం పోలీస్‌ సిబ్బంది, సిఆర్పిఎఫ్‌ 212 బెటాలియన్‌, సిఆర్పిఎఫ్‌ 141 బెటాలియన్‌ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా, మావోయిస్టు పార్టీ పామేడు దళం సభ్యులైన చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం, కిష్టారం పోలీసు స్టేషన్‌ పరిధి కామారం గ్రామానికి చెందిన సోడే కామే, సోడి బండు, సానుభూతిపరుడు సోడి చంటిని అరెస్టు చేశారు. సోడి కామే, సోడి బందు ఐదేళ్లగా మావోయిస్ట్‌ పార్టీ పామేడు దళ సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరు తెలంగాణ-చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర మావోయిస్టు పార్టీ సభ్యులతో కలిసి అనేక సంఘటనలలో పాల్గొన్నారు. వీరిపై పలు కేసులు ఉన్నాయి. పోలీసులను చంపాలనే ఉద్దేశంతో ల్యాండ్‌ మైన్స్‌ ఏర్పాటు చేయడానికి పైడిగూడెం అటవీ ప్రాంతానికి వచ్చినట్లుగా అరెస్టయిన ముగ్గురు అంగీకరించారు. వారి నుండి జిలెటర్‌ స్టిక్స్‌-10, ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు-4, కార్డెక్స్‌ వైర్‌ 20 మీటర్స్‌, ఎలక్ట్రిక్‌ వైర్‌-50 మీటర్లు, బ్యాటరీలు-1, స్టీల్‌ బకెట్‌-1 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీకి ఎవరైనా సహకరిస్తే, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఓఎస్‌డి సాయి మనోహర్‌, భద్రాచలం ఏఎస్పీ పంకజ్‌ పరితోష్‌, సిఆర్పిఎఫ్‌ 141 బిఎన్‌ కమాండెంట్‌ కమల్‌ వీర్‌, డిప్యూటీ కమాండెంట్‌ అజరు ప్రతాప్‌, సీఐ రమేష్‌ పాల్గొన్నారు.