May 09,2021 12:10

అందమైన కలలకు
మధురమైన అనుభూతులకు
ప్రతిరూపమే మాతృత్వం

పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి
తన ప్రాణాన్ని పణంగా పెట్టగల
త్యాగమే మాతృత్వం
నవమాసాల యజ్ఞఫలమే మాతృత్వం

పురిటి వాలసలతో పులకరిస్తూ
భాషకందని భావాలతో
తన బిడ్డను పలకరిస్తూ
తన జన్మ సార్ధకమయ్యిందని
ఉప్పొంగే ఉత్సాహమే మాతృత్వం
మమతల్ని రంగరించి
మురిపాలను స్రవించి
పసివాడి ఆకలి తీర్చుతూ
తాను పొందే తన్మయత్వమే మాతృత్వం

బుడి బుడి నడకల్ని
పసివాడి బోసి నవ్వుల్ని
వచ్చీ రాని మాటల వయ్యారాల్ని
తలచుకుంటూ అనుభూతుల్లో రమించే
తల్లుల అద్భుత స్వానుభవమే మాతృత్వం
 

- ఎంఎస్‌ రాజు