Mar 07,2021 07:18

టీవీల్లో, ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చే కొన్ని ప్రకటనలు వ్యాపార కోణంలోనే కాక... ఏదోక సందేశాన్నిచ్చేవిగా వుంటాయి. కొన్ని గిలిగింతలు పెడితే... కొన్ని మనసులను నున్నితంగా తాకుతాయి. ఆలోచింపజేస్తాయి. అలా ఆలోచింపజేసే ఒక ప్రకటన (అడ్వర్టైజ్‌మెంట్‌) 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. 'మహిళ అంటే మాతృత్వం మాత్రమే కాదు... అంతకుమించి' అనే విధంగా ఒక సందేశాన్నిస్తుంది ఆ ప్రకటన. 'లత... ఆ ఇంటికి పెద్దకోడలు. ఈమె ఉపాధ్యాయురాలు కూడా. తన తోటికోడలు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలని కుటుంబసభ్యులు లతను అడుగుతారు. పిల్లలు లేని లత... ఆ సమయంలో ఎంతో ఉద్వేగానికి గురవుతుంది. తన కన్నీళ్లను కనబడనీయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంది. 'నా బిడ్డకు అక్క పేరే పెట్టాలనుకుంటున్నా. ఈ ఇంటికి పెద్ద కోడలిగా... ఇంట్లో బాధ్యతలన్నిటినీ నిర్వర్తిస్తూ.. ఒక మాతృమూర్తిగా కుటుంబమంతటికీ సేవలు చేస్తుంది. ఉపాధ్యాయురాలిగా... స్కూల్లోని పిల్లలకు సైతం తన మాతృత్వాన్ని పంచుతుంది. అందుకే నా కూతురికి అక్క పేరే పెడతాను' అనడంతో లత మాతృ హృదయం పొంగిపొర్లుతుంది. ఇది నెటిజన్ల హృదయాలను హత్తుకొని... బాగా వైరల్‌ అవుతోంది.
మాతృత్వానికి విస్తృతమైన అర్థం వుంది. గర్భం ధరించి బిడ్డలను కంటేనే మాతృమూర్తి... కనకపోతే మాతృమూర్తి కానట్టా..? అలాగే బిడ్డలను కనేసినంత మాత్రాన మాతృత్వానికి పరిపూర్ణత వచ్చేసినట్టా? పిల్లల్ని కనేసి అమ్ముకునే వారు, సమాజానికి భయపడి అబార్షన్లు చేయించుకునేవారు... లేక ఏ చెత్తకుప్పలోనే పారేసిపోయే వారి అనేక కథలు నిత్యం చూస్తూనే వున్నాం. ఆడపిల్లను కంటే... ఇంటిగడప తొక్కొద్దని చెప్పే అత్తగారూ ఓ మాతృమూర్తే. మాతృత్వానికి మూలమైన ఆడపిల్లను పుట్టక ముందు, పుట్టిన తర్వాత చంపేసే సంస్కృతి ఇంకా దేశంలో వుంది. మాతృత్వానికి విలువ ఇవ్వడమంటే ఇదేనా? మాతృత్వం అంటే... ఇష్టపడిన వ్యక్తి ద్వారా బిడ్డను కనే స్వేచ్ఛ వుండడం. కానీ ఇవాళ స్త్రీ ఇష్టానికి విలువ వుందా? ఆచారాలు సంప్రదాయాలు, పెద్దరికం పేరుతోనో... కులాలు, కట్నాలు పేరుతోనో స్త్రీ ఇష్టాన్ని అణచివేస్తున్నది నిజం కాదా? ఇప్పుడు కొత్తగా... ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు 'లవ్‌ జిహాద్‌' పేరుతో స్త్రీ ఇష్టాన్ని తొక్కేయడంలేదా? వీటన్నిటి మధ్య- 'నేను ప్రేమించాను గనుక నువ్వూ ప్రేమించాలి... పెళ్లి చేసుకోవాలి... లేదంటే యాసిడ్‌ పోస్తా'నని బెదిరించే కిరాతకులు మాతృత్వానికి విలువనిస్తున్నారా? ఆడబిడ్డ పుడితే లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడే పరిస్థితి ఇప్పుడు వుందా? మాతృత్వం విలువను క్రమంగా పోగొట్టుకుంటున్నాం. గౌరవించడం మర్చిపోతున్నాం. సోవియట్‌లో ఎక్కువమంది బిడ్డలను కన్న మాతృమూర్తులను బిరుదులిచ్చి గౌరవించేవారు. ఆ సంస్కారం మన సమాజంలో కొరవడింది. నయా ఉదారవాద సమాజం మాతృత్వాన్నీ చంపేస్తోంది. నిజమైన మాతృత్వానికి పరిపూర్ణత... సంపూర్ణ వికాసం అనేది... దోపిడీ లేని వ్యవస్థలోనే సాధ్యపడుతుంది.
'ఆధునిక మహిళ చరిత్రను తిరిగరాస్తుంది' అని గురజాడవారు అన్నట్టుగా... ఆకాశమే హద్దుగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది నేటి స్త్రీ. అయినప్పటికీ... సంతానలేమి కారణంగానో, ఆడపిల్లలు పుట్టారనో సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏ స్త్రీ అయినా తల్లి కానంత మాత్రాన సమాజంలో తన ప్రాధాన్యతను, తాను నిర్వహిస్తోన్న పాత్రను తక్కువ చేయలేం. సృష్టికి మాతృత్వం అవసరమే... కానీ, నిర్భందం కారాదు. బిడ్డను కనాలా? వద్దా? అనేది స్త్రీ హక్కు. కొన్ని సందర్భాల్లో శారీరక ధర్మాలు అనుకూలించకపోవడం వల్ల కూడా తల్లి కాలేకపోవచ్చు. అంతమాత్రాన సమాజంలో తాను నిర్వహించే పాత్రను తక్కువజేసి చూపలేం. మాతృత్వం పొందలేని స్త్రీలో కూడా మాతృ హృదయం వుంటుంది. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోడానికే భయపడే మగానుభావులు... చావుకు సిద్ధపడి బిడ్డకు జన్మనివ్వాల్సి వస్తే ఎంతమంది సిద్ధపడతారు? ఈ దేశ ప్రధాన న్యాయమూర్తే... 'మానభంగం అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి తర్వాత బలవంతపు సెక్స్‌ నేరమౌతుందా? పరిశీలించాలి' అని కామెంట్లు చేసే స్థాయిలో వుంటే... స్త్రీకి మాతృమూర్తిగా నిజమైన గౌరవం ఇవ్వడానికి మనమింకా ఎన్ని మైళ్ల దూరంలో వున్నామో లెక్కేసుకోవాలి. 'స్త్రీ ఒక విశ్వం, మాతృత్వం ఒక పాలపుంత, భార్యత్వం ఒక సౌరకూటమి, ఈ రెండూ కాక కొన్ని కోట్ల పుంతలు, కూటములు ప్రజ్వలిస్తున్నాయా విశ్వంలో. నీకు చూసే శక్తి లేకపోతే టెలీస్కోప్‌ తెచ్చుకునైనా చూడు, లేకపోతే చచ్చుబడిపోతుందీ సమాజం' అంటాడో రచయిత. ప్రతీ స్త్రీలోనూ అంతర్లీనంగా వుండే మాతృ హృదయాన్ని దర్శించడానికి ప్రయత్నిస్తే... మగాడిలోని పురుషాహంకారం చచ్చుబడుతుంది.

మరిన్ని చదవండి :  కోవిడ్‌ సంక్షోభంతో మహిళలకు మరిన్ని కష్టాలు

                      విజయం దిశగా ఎల్‌డిఎఫ్‌... విష ప్రచారాలతో యుడిఎఫ్‌, బిజెపి...