ప్రజాశక్తి-కాకినాడ, పెద్దాపురం మాతృభాషను అధ్యయనం చేయకుండా ఇతర భాషలు అర్థం చేసుకోలేరని రిటైర్డ్ తెలుగు పండితులు కాకరపర్తి దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక యుటిఎఫ్ హోమ్‌లో తెలుగు పండితులు పిఎస్. ఫణిబాబు అధ్యక్షతన తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులు 160 జయంతి సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాష ఉద్యమానికి ఎంతో కృషి చేశారని, భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరుపురానివన్నారు. వ్యవహారిక భాషను అమల్లోకి తీసుకురావడంలో ఆయన అనేక ఒత్తిళ్లు, నిర్బంధాలను ఎదుర్కొన్నారన్నారు. ఈ సభలో తెలుగు భాష ఉపాధ్యాయులు డాక్టర్ కెఎస్.ప్రకాశరావు, వెంకటస్వామి విజ్ఞాన కేంద్రం కన్వీనర్ కె.సత్తిరాజు మాట్లాడారు. అనంతరం నగరంలోని పలు పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు ప్రసాదరావు, దక్ష స్కూల్ కరస్పాండెంట్ పి.యోగేశ్వర్, యుఎస్‌ఎన్.రెడ్డి, మలక వెంకటరమణ, ఎం.వెంకట రమణ, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ పాఠశాల నుంచి 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు భాష పరిరక్షణ, వికాసం విద్యార్థుల చేతుల్లోనే ఉందని ప్రముఖ సాహితీవేత్త, కవి, గజల్ రచయిత డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు. పెద్దాపురంలోని శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో సోమవారం జరిగిన వ్యవహారిక భాషా ఉద్యమ నేత గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఇంత ఘనంగా జరగటం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా పిల్లలు ప్రదర్శించిన ప్రక్రియలు ఆకట్టుకున్నాయన్నారు. తెలుగు భాష కేవలం సాహిత్య భాషగానే ప్రాచుర్యంపొందుతుందని, జ్ఞాన భాషగా కూడా తెలుగు భాష అభివృద్ధి చెందాలన్నారు. శ్రీప్రకాష్ స్కూల్ డైరెక్టర్ సిహెచ్ విజరు ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరు తెలుగు భాషపై పట్టు సాధించాలన్నారు. వార్తాపత్రికలను చదవటం ద్వారా అర్థవంతమైన, ఆమోదయోగ్యమైన భాష అలవడుతుందన్నారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఈ సభలో బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎంవివి.మూర్తి, పాఠశాల అకడమిక్ అండ్ కల్చరల్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.










