మాతృభాషా వాలంటీర్లను రెన్యువల్ చేయకుంటే ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి
గిరిజన సంఘం నేత అప్పలనర్స
ప్రజాశక్తి-పాడేరు: ఆదివాసీ మాతభాషా విద్యా వాలంటీర్లను తక్షణమే రెన్యువల్ చేయకపోతే సిఎం కార్యాలయం ముట్టడికి పిలుస్తామని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. తమను రెన్యువల్ చేయాలని కోరుతూ ఐటిడిఎ గేటు ఎదుట ఆదివాసీ మాతృభాషా విద్య వాలంటీర్లు చేపట్టిన 72 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని మూడో రోజు గురువారం సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షంలో మూడురోజులుగా తడుస్తూనే తీవ్ర ఇబ్బందుల మధ్య భాషా వాలంటీర్లు నిరసన వ్యక్తం చేస్తున్న, గిరిజన ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వానికీ చీమ కుట్టినట్టు లేదన్నారు. మాతృభాష విద్యా వాలంటీర్ల సమస్యలు పరిష్కరించడంలో గిరిజన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భాషావాలంటీర్ల రెన్యువల్‌కు రూ.35 కోట్లు అవసరమని,అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.4 కోట్లు మాత్రమే మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. చాలీచాలని నిధుల మంజూరుతో గిరిజనులు ఉపాధి, విద్యా అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతో రాష్ట్రంలో 1200 మంది భాషా వాలంటీర్లు రోడ్డున పడ్డారని, సుమారు 45 వేల మంది విద్యార్థులు మాతృభాష విద్యాబోధనకు దూరమయ్యారని తెలిపారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో భాషా వాలంటీర్లు ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన చేపట్టినా ప్రభుత్వం స్పందించపోవడం నిర్లక్ష్యమేనని, పోరాడి రూ.నాలుగు కోట్లు సాధించుకుని రెన్యువల్ కోసం నెలరోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా చలనం లేకపోవడం దారుణమన్నారు. భాష వాలంటీర్ల సమస్య పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి పిలుపుకు వెనకడుగు వేసేది లేదన్నారు.భాషా వాలంటీర్లు పోరాటానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో భాషా వాలంటీర్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె.నర్సయ్య, అధ్యక్ష, కార్యదర్శులు పి కుమారి, కె.సర్బునాయుడు, నాయకులు చిట్టిబాబు, రమణబాబు, సతీషు, చిన్ని, గణేష్, పాల్గొన్నారు.










