Nov 04,2023 22:50

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం జిల్లాలో మాతృ, శిశు మరణాలను నివారణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. శనివారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ మాధవీలత, జెసి తేజ్‌ భరత్‌, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, హెల్త్‌, శిశు మహిళా సంక్షేమం, జగనన్నకు చెబుదాం, పాఠశాల విద్య, నాడు నేడు రెండవ దశ పనులు, విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో తదితర అంశాల పురోగతిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత వివరిస్తూ జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న కిశోర బాలికలు, గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా ఐరన్‌ మాత్రలతోపాటు పోషకాహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు సంబంధిత అధికారులకు ప్రతి రోజు ఆదేశాలు చేస్తూ పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రక్తహీనతకు సంబంధించి 10-19 మధ్య వయస్సు గల 41,035 మంది బాలికలకు పరీక్షలు నిర్వహించగా ఇందులో 14,385 మందికి తేలికపాటి, 15,625 మందికి మోస్తారుగా 100 మందికి తీవ్రంగా రక్తహీనతను గుర్తించామన్నారు. రక్త హీనతను అధిగమించేందుకు వీరందరికీ పౌష్టికారం, మెడిషన్‌ అందజేస్తున్నామన్నారు. 15- 49 వయస్సు గల 6732 మంది గర్భిణీలకు రక్తహీనత పరిక్షలు నిర్వహించి లోపాన్ని గుర్తించిన 1277 మంది గర్భిణీలకు, 5 ఏళ్లలోపు 83,572 చిన్నారులకు పరీక్షలు నిర్వహించి లోపాన్ని గుర్తించిన 1720 మంది చిన్నారులు హిమోగ్లోబిన్‌ శాతం పెంచేందుకు మెడిసిన్‌, పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 405 జెఎఎస్‌ శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.వేంకటేశ్వరరావు, డిసిహెచ్‌ఒ డాక్టర్‌ ఎమ్‌.సనత్‌ కుమారి, సిపిఒ ముఖలింగం, బిసి వెల్ఫేర్‌ అధికారి రమేష్‌, ఎస్‌సి వెల్ఫేర్‌ అధికారి పి. సందీప్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి, డిఇఒ ఎస్‌.అబ్రహం, డిఎల్‌డిఓలు వి.వీణాదేవి, శాంతామణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.