ప్రజాశక్తి-పాడేరు: ఆదివాసి మాతృభాష విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యాన భాషా వాలంటీర్లు ఐటిడిఎ గేటు ఎదుట నాలుగు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షలు శుక్రవారం ఉదయం విరమించారు. మాతృభాష విద్యా వాలంటీర్లకు న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్, ఐటిడిఎ ఇంచార్జ్ పిఒ వి.అభిషేక్ హామి ఇచ్చారు. నిమ్మరసం ఇచ్చి భాష వాలంటీర్ల 72 గంటల నిరాహార దీక్ష విరమింపజేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, రెండు రోజుల్లో ఐటిడిఎ ఖాతాకు నగదు పడుతుందని తెలిపారు. గిరిజన బాలల విద్య సామర్థ్యం పెంపుదలకు మాతృభాషల్లో విద్యాబోధన అవసరమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కరిస్తామన్నారు. 721 మంది భాషా వాలంటీర్లు అవసరమని, నెలకు జీతం చెల్లిస్తూ నియమించుకునేలా అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తానని తెలిపారు. 24 గంటల్లో కలెక్టర్ అనుమతిస్తారని, కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చేనెల నుంచి భాష వాలంటీర్లకు నియామకం జరుగుతుందని స్పష్టం చేశారు.
అంబేద్కర్ కూడలి వరకూ ర్యాలీ
దీక్షను విరమించిన భాషా వాలంటీర్లు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. దీక్షా శిబిరం నుంచి సినిమా హాల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం నిర్వహించిన సమావేశంలో భాష వాలంటీర్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె.నర్సయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీను మాట్లాడుతూ, సమస్య పరిష్కారం కోసం అధికారులు ఇచ్చిన హామీని తక్షణమే అమలులోకి తీసుకొని రావాలని, హామీ అమలు చేయకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.
గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి.లక్కు మాట్లాడుతూ, భాషా వాలంటీర్ల సమస్యపై గిరిజన ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును ప్రశ్నించారు. భాషా వాలంటీర్లు ఉద్యోగ భద్రత కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు, భాషా వాలంటీర్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె.నర్సయ్య, అధ్యక్ష, కార్యదర్శులు పికుమారి, కె.సర్బునాయుడు, నాయకులు చిట్టిబాబు, రమణబాబు, సతీషు, చిన్ని, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంఘం కృషితో సమస్య పరిష్కారం
గిరిజన సంఘం ప్రతినిధులతో గురువారం రాత్రి 9 గంటలకు జిల్లా కలెక్టర్ నివాసంలో ఐటిడిఎ ఇంచార్జ్ పిఒ వి.అభిషేక్, గిరిజన సంఘం జాతీయ నాయకులు పి.అప్పలనర్స, భాషా వాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీను, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.నర్సయ్య, అధ్యక్ష, కార్యదర్శులు పి.కుమారి, సర్బునాయుడుతో జరిగిన చర్చలు సఫలమైంది. మంజూరైన నిధులు ఎస్‌ఎస్‌ఎ నుండి ఐటిడిఎ పిఒ ఖాతాకు బదిలైన 24 గంటల్లో నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంజూరైన నిధులతో 6నెలలకు సరిపడా గౌరవ వేతనం మంజూరుకు తగిన ఉత్తర్వులు తక్షణమే జారీ చేయాలని ఐటిడిఎ ఇంచార్జ్ పిఒ వి.అభిషేక్ కు కలెక్టర్ ఆదేశించారు. వేతన బకాయి సమస్య లేకుండా ముందస్తు గౌరవ వేతనం చెల్లింపుకు తగిన చర్యలు తీసుకోవాలని, ముందస్తుగా ప్రతి నెల గౌరవ వేతనం రూ.5000 చెల్లింపు అదేశాలు జారీ చేయాలని ఇంచార్జ్ పిఒకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.










