
ప్రజాశక్తి - చిలమత్తూరు : గుడిసెలు వేసుకున్న పేదలందరికి 15 రోజులలో ఇంటి పట్టాలు ఇస్తామని వైసిపి హిందూపురం ఇంచార్జ్ దీపిక ఇచ్చిన హామీ ఏమైందని, మాటలతో ఎన్నాళ్లు మభ్య పెడతారని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ నిలదీశారు. మండలంలోని కోడూరు పంచాయతీ పరిధిలోని 805 సర్వే నెంబర్ జగనన్న లే అవుట్ లో ఇల్లు లేని నిరుపేదలు వేసుకున్న గుడిసెల వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రమణ మాట్లాడుతూ అధికారులు, నాయకుల హామీలు నీటిమీద రాతలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి దీపిక ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని భావించామని తహశీల్దార్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయిస్తామంటే పేదల సమస్య పరిష్కారం అవులుందని ఆనందపడ్డామని అన్నారు. అయితే ఆమె ఇచ్చిన హామీ ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు. 270 కుటుంబాల సమస్యనే పరిష్కరించలేని ఇన్‌ఛార్జి రాబోయే కాలంలో ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశం మరో సారి ఎంపిపి పురుషోత్తమ రెడ్డి పేదలందరికి ఇంటి పట్టాలు మరో స్థలంలో ఇవ్వటానికి స్థలం చూశామని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇన్ని రోజులు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడానికి తెరవెనుక అధికార పార్టీ నాయకులే ఉన్నట్లు అనుమానం కలుగుతుందని అన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమినిబడా బాబులకు అప్పగించాలన్న అజెండా మేరకే వారు పనిచేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. తాము శాంతి యుతంగా గుడిసెలలో జీవనం కొనసాగిస్తున్నామని అలా కాదని పేదల మనోభావాలు దెబ్బతీసేలా ప్రజాప్రతినిధులు, నాయకులు వ్యవహరిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు, నాయకులు స్పందించి గుర్తించిన మేరకు 805 జగనన్న లేఅవుట్ లోనే వెంటనే పట్టాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్, లక్ష్మినారాయణ, వెంకటేష్, రామచంద్ర, చందు, రియాజ్, శివ, రహంతుల్లా, సదాశివరెడ్డి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.