Jun 06,2023 00:16

ఘటనా స్థలి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి/ప్రత్తిపాడు : వట్టిచెరకూరు వద్ద సోమవారం మధ్యాహ్నం ట్రాక్టరు బోల్లాపడిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా 25 మంది గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడుకు చెందిన వారు దాదాపు 40 మంది పొన్నూరు మండలం జూపూడిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఈఘటన జరిగింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి అత్యవసర వార్డులో విషాదం అలుముకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వీరంతా ఆస్పత్రి రాగా అప్పటికే వైద్యులు, సిబ్బంది అంతా భోజనానికి వెళ్లారు. క్షతగాత్రులు అత్యవసర వార్డులో చికిత్సకు కొంత జాప్యమైంది. మార్గ మధ్యలో మృతి చెందిన వారి సమీప బంధువులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి ఆర్‌ఎంఒ సతీష్‌ అత్యవసర విభాగాన్ని సందర్శించి వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. సూపరింటెండెంట్‌ ప్రభావతికి సమాచారం అందించారు. రెండున్నర గంటల సమయంలో చికిత్స ప్రారంభమైంది. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సలోమీ అనే మహిళ మృతి చెందింది.
ఈ ఘటన గురించి తెలియగానే మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆస్పత్రికి వచ్చి చికిత్సపొందుతున్న వారిని పరామర్శించారు. క్షతగాత్రులను కేంద్రమంత్రి ప్రవీణ్‌పరివార్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జెసి జి.రాజకుమారి పరామర్శించారు. మార్చురీలో ఉన్న మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి స్వగ్రామానికి తరలించారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా కింద రూ.5 లక్షలు అందిస్తామని మంత్రి రాంబాబు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు పరిహారం ఇస్తామని చెప్పారు.
కొండేపాడు ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కార్మికులుగా పొలం పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం వేసవిలో ఉపాధి పనులకు వెళ్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. మహిళలంతా పొద్దున్నే ఉపాధి హామీ పనులకు వెళ్లారు. 11 గంటలకు పని నుండి హడావుడిగా జూపూడికి బయలుదేరారు. అప్పటికే ఎండ ముదరడంతో కొంతమంది ట్రాక్టర్‌ దగ్గరకు వచ్చి కూడా వెనక్కు వెళ్లారు. మిగతావారు గ్రామంలోని సామేలుకు చెందిన ట్రాక్టర్‌లో 40 మంది వరకూ బయలుదేరగా ట్రాక్టర్‌ను సామేలు మేనల్లుడు కుర్రి ప్రశాంత్‌ నడుపుతున్నాడు. ప్రమాద సమయంలో ప్రశాంత్‌ ట్రాక్టర్‌ నుండి దూకి ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఘటనా స్థలిని పరిశీలించిన గుంటూరు దక్షిణ మండలం డీఎస్పీ షేక్‌ మహబూబ్‌ బాషా మాట్లాడుతూ అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
మృతుల్లో ఒకరైన మామిడి ఝాన్సీ భర్త మూడేళ్ల కిందటే అనారోగ్యంతో మృతి చెందగా ఇద్దరు కుమారులనూ ఆమే జాగ్రత్తగా చూసుకుంటూ చదివిస్తోంది. ఇద్దరు కుమారుల్లో ఒకరు ఇటీవలే ప్రైవేటు ఉద్యోగంలో చేరగా మరో కుమారుడు ఇంజినీరింగ్‌ చదువుకుంటున్నాడు. కూలీ పనులే ఆధారంగా జీవించే ఝాన్సీ తమకున్న కొద్దిపాటి పొలాన్ని అమ్ముకుని సొంతిల్లు నిర్మించుకుని తన ఇద్దరు కుమారులకు పెళ్లిల్లు చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె కలలను కల్లలు చేస్తూ ప్రమాదం ఆమె ప్రాణాన్ని బలిగొంది.