Jun 22,2023 00:05

గర్భిణీ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:గర్భిణీ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఐద్వా జిల్లా అద్యక్షులు వివి జయ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా అరకులోయ ఏపీ ఆదివాసి గిరిజన సంఘం కార్యాలయంలో బుధవారం ఆమె స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ, అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతి కుంబుర్ల గ్రామంలో 45 కుటుంబాలు, 230 మంది గిరిజనులు జీవిస్తున్నారన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదన్నారు. మంగళవారం గర్భిణీ స్త్రీ కొర్ర రోజా (22) పురిటి నొప్పులు రావడంతో డోలి మోతతో ఆసుపత్రిలో తీసుకెళ్తుండగా మార్గంలో మృతి చెందడం బాధాకరమన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తక్షణం ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ స్పందించి గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాషా వాలంటరీ సంఘం జిల్లా అధ్యక్షురాలు పి.కుమారి, ఐద్వా మండల సెక్రటరీ శశికళ, మండల కమిటి సభ్యులు సన్యాసమ్మ పాల్గొన్నారు.