
ప్రజాశక్తి-నక్కపల్లి:సాంకేతిక పరిజ్ఞానం అందు పుచ్చుకుని విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించే విధంగా విద్యను అందించాలని ఎంఈఓ కే.నరేష్ ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం హెచ్‌ఎమ్ రాణీలలిత ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు పాఠశాల సముదాయ తరగతులకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ విద్యార్ధి శ్రవణ భాషణ పఠన లేఖనాదులపై దృష్టిసారించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. లెర్నింగ్ ఇంప్రూవ్ మెంట్, టరల్ వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యను బోధించాలన్నారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.రిసోర్స్ పర్సన్‌గా కె.సత్తిబాబు, రామకృష్ణలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్.వి.ఎస్.ఆచార్యులు, టి.వి.రమణ, నక్కపల్లి, రాయవరం, పాయకరావు పేట మండలాల భాషోపాధ్యాయులు పాల్గొన్నారు.