ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : మాతా, శిశు ఆరోగ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించి, వారి ఆరోగ్య శ్రేయస్సుకై కృషి చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు సూచించారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న పిపి యూనిట్‌లో పట్టణ పరిధిలో ఉన్న ఆరోగ్య సిబ్బందికి వైద్యాధికారి డాక్టర్ వై.విజయమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశాడే కార్యక్రమాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు మాట్లాడుతూ గర్భిణీలకు, శిశువులకు ఆశా కార్యకర్తలు అందజేసిన వైద్య సేవలను ఎప్పటికప్పుడు ఇ- ఆశా యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఈ నెల మొదటి వారం తల్లి పాల వారోత్సవాలు సందర్భంగా బిడ్డకు తల్లి పాల ఆవశ్యకత పై అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈ నెల 7 నుండి 12 మధ్యలో నిర్వహించబోయే మిషన్ ఇంద్ర ధనుష్ ప్రోగ్రాంకు సర్వేలో గుర్తించిన టీకా అర్హులు అందరినీ కొత్తగా చేర్చబడిన యూవిన్ పోర్టల్‌లో నమోదు వైద్య సిబ్బంది త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లెప్రసీ సర్వే, ఎన్సిడి సర్వే , ఫీవర్ సర్వే తదితర కార్యక్రమాలపై దృష్టి సారించి పూర్తి స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందజేసి నివేదికల పురోగతి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి. లావణ్య, సూపర్ వైజర్స్ బి. పుష్ప, జయగౌడ్, స్టాఫ్ భారతి, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
వీరఘట్టం : గ్రామాల్లో జ్వరాలు అధికంగా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక పిహెచ్‌సి వైద్య అధికారులు జి.ప్రదీప్‌కుమార్, పి.ఉమామహేశ్వరి ఆశా కార్యకర్తలను ఆదేశించారు. మంగళవారం స్థానిక పిహెచ్‌సిలో ఆశా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా వ్యాధులు ప్రభలే అవకాశముందని, వీటిని దృష్టిలో పెట్టుకొని తరచుగా గ్రామాలు సందర్శించాలని సూచించారు. జ్వర పీడితులకు రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి పంపించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. గర్భిణీలను కూడా గుర్తించి వారికి సకాలంలో వ్యాధి నిరోధక టీకాలపడేలా చూడాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. మండలంలోని బిటివాడ పిహెచ్‌సిలో కూడా వైద్యాధికారులు మానస, నితీశ ఆశ కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు జనార్ధన రావు, పార్వతీ, శాంతి కుమారి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతానగరం :సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి ఎం.రాధాకాంత్ అన్నారు. మండలంలోని సీతానగరం, పెదఅంకలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం ఆశాడే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించాలని ప్రాథమిక ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సీతానగరం పిహెచ్‌సి వైద్యాధికారి కె.శిరీష, హెచ్‌విలు సత్యవతి, వరలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










