ప్రజాశక్తి-అనంతపురం జిల్లాలో మాతా, శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి ఇబి.దేవి సూచించారు. శనివారం గతమాసంలో జిల్లాలో జరిగిన 2 మాతా, ఆరుగురు శిశుమరణాలకు కారణాలను సంబంధింత డాక్టర్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతా,శిశుమరణాలు నివారించాలన్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఎక్కడైనా మాతా, శిశు మరణాలున సంభవిస్తే కారణాలను తెలుసుకుని మున్ముందు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాలన్నారు. ముఖ్యంగా ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారాలలోపు రిజిస్ట్రర్ చేసుకోవడంతోపాటు ఆమెకు అన్నిరకాల వైద్య పరీక్షలు అందించాలని సూచించారు. ఏ తల్లీ ప్రసవ అనంతరం అధిక రక్తస్త్రావంతో మరణించకూడదన్నారు. ప్రమాదకర లక్షణాలు ఉన్న గర్భిణుల పట్ల జాగ్రతలు తీసుకుంటూ సుఖ ప్రసవం జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం 10 డెలివరీలు చేయాలని సూచించారు. ప్రతి కాన్పు కేసు జిల్లా ఆసుపత్రికి పంపడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. అవసరాన్ని బట్టి 108, 104, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను వాడుకోవాలని కోరారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ రక్తహీనత ఉన్నా, గుండె సంబంధిత సమస్యలు ఉన్నా, తక్కువ ఎత్తు, కాన్పుకూ కాన్పుకు ఎక్కవ సమయం ఉన్నా, తల్లి గర్భంలో ఉమ్ము నీరు తక్కవ ఉన్నా, బిడ్డ పెరుగుదల లేకపోయినా, హైరిస్క్ గర్భిణులను గుర్తించి ప్రత్యేక వైద్యసేవలు అందించాలని కోరారు. ప్రతి వంద మంది గర్భిణుల్లో 10 నుంచి 15 మంది హైరిస్క్ గర్భిణులు ఉంటారన్నారు. అలాంటి వారిని మనం గుర్తించాలన్నారు. ప్రతి గర్భిణీ వారి సంబంధీకులతో మాట్లాడి బర్త్‌ప్లాన్ చేయాలన్నారు. ఊహించిన ప్రసవ తేదీకి మూడు రోజుల ముందే ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి చిన్న పిల్లల వైద్యులు శంకర్‌నారాయణ, డాక్టర్ నిసార్ బేగం, డిప్యూటీ హెల్తాఫీసర్ గంగాధర్, ఎంపిహెచ్‌ఇఒ లక్ష్మన్న, ఎంపిహెచ్‌ఎస్ హేమలత, హెచ్‌ఇ సుబ్రమణ్యం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి ఇబి.దేవి










