Aug 02,2023 23:02

సామూహిక సీమంతాల్లో హాజరైన మంత్రి ధర్మాన

- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
మాతాశిశు సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా టేక్‌ హోం రేషన్‌ కింద సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాలింతలు, గర్భిణులకు ఇంటి వద్దకే పౌష్టికాహారం అందజేసేందుకు టేక్‌ హోం రేషన్‌ను ప్రారంభించిందన్నారు. ఎక్కువ మందిలో రక్తహీనత అధికంగా ఉండడం వల్ల కాన్పు సమయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపిలు గొండు రఘురాం, అంబటి నిర్మల, జెడ్‌పిటిసి రుప్ప దివ్య, గార సిడిపిఒ రాధామాధవి, ఎసిడిపిఒ తులసిలక్ష్మి, వైసిపి నాయకులు అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ టేక్‌ హోం రేషన్‌ కింద సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందజేస్తోందన్నారు. గతంలో ఇంటికే అందజేసిన ఈ సరుకులు సక్రమంగా వినియోగానికి నోచుకోలేదన్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వండి, వడ్డించే విధానం అమలు చేసిందని చెప్పారు. పలు కారణాలతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి, తిని వెళ్లే వారి సంఖ్య తగ్గుతోందని గుర్తించిన ప్రభుత్వం సర్వే చేపట్టిందన్నారు. ఇంటికే సరుకులు పంపిణీ చేయాలని ఎక్కువ మంది కోరడంతో టేక్‌ హోం రేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అక్రమాలకు తావు లేకుండా ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సంపూర్ణ పోషణ కిట్‌లో 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర లీటరు పామాయిల్‌, ఐదు లీటర్ల పాలు, రెండు కిలోల చోడిపిండి, కిలో అటుకులు, పావు కిలో బెల్లం, పావు కిలో ఖర్జూరం, పావు కిలో వేరుశనగ చిక్కీలు, 25 కోడిగుడ్లు ఇస్తారని తెలిపారు. ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు రెండున్నర కిలోల బాలామృతం, రెండున్నర లీటర్ల పాలు, 25 గుడ్లు ఇస్తారని, 3 నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనంతో పాటు ఉడకబెట్టిన కోడిగుడ్డు, వంద మిల్లీలీటర్ల పాలు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పీడీ జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు.