పాలకొండ రూరల్: మాతా, శిశు సంరక్షణ ఎంతో బాధ్యతాయుతమైనదని ఆ దిశగా నర్సులు, మిడిల్ లెవెల్ ప్రొవైడర్లు అవగాహనతో పనిచేయాలని స్థానిక ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగభూషణరావు అన్నారు. మాతా, శిశు సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం అవగాహన కల్పించేలా న్యూ హెల్త్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగభూషణరావు మాట్లాడుతూ తల్లి, బిడ్డలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తిగా అవగాహన చేసుకుని వారికి వివరించి చెప్పాలన్నారు. అందుకోసం సమాచారానికి పలు రకాల మాధ్యమాలను వినియోగించి అర్ధమయ్యేలా తల్లులకు, వారి కుటుంబ సభ్యులకు తెలపాలన్నారు. చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ జె.రవీంద్ర కుమార్ మాట్లాడుతూ తల్లులకు, వారి సహాయకులకు పౌష్టిక ఆహారం ఏ సమయంలో ఏ పరీక్షలు చేయించుకోవాలో అవగాహన కల్పించాలన్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా కూడా సమాచారం లభ్యమవుతుందని తెలిపారు. రెండు రోజుల్లో సుమారు 300 మంది హెల్త్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.










