ప్రజాశక్తి-పాడేరు: మాతా శిశు మరణాలు జరిగితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో గెమ్మిలి, ఈదులపాలెం, రూడకోట, కోరుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపై వైద్యాధికారులు, ఐసిడి ఎస్ సూపర్ వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్య కర్తలతో సమీక్షించారు. ఒడ్డు మామిడి గ్రామంలో గర్భిణీ మృతి చెందిన విషయాన్ని వైద్యాధికారులకు సమాచారం అందించలేదని ఐసిడిఎస్ సూపర్ వైజర్ ఎం.లక్ష్మికి, అంగన్వాడీ టీచర్ జి.మణికి 15 రోజలు జీతం నిలుపుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు గ్రామంలో రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని అంబులెన్సులు అన్ని మరమ్మతులు చేయడం జరిగిందని చెప్పారు. అంబులెన్సుల సమస్య ఉంటే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. రూడకోట ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన అత్యవసర మందులు కొనుగోలు చేయడానికి రూ.25 వేలు మంజూరు చేసామని, వెంటనే నిధులు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. రూడకోట ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న నాడు-నేడు పనుల పురోగతిపై ఆరా తీసారు. బర్త్ వెయిటింగ్ హాలు, కార్వర్టల నిర్మాణాలను అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు పనుల పర్యవేక్షణ, పిహెచ్ సిలలో మౌలిక సదుపాయాలు కల్పనకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా క్వాలిటీ అష్యూరెన్స్ కమిటీ ఏర్పాటు చేసామన్నారు. కమిటీలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, డిసిహెచ్‌ఎస్, అదనపు జిల్లా వైద్యాధికారి, పిడియాట్రిషన్, జనరల్ సర్జన్ తదితర 15 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. ఎంపిక చేసిన ఆసుపత్రులలో కమిటీ సూచనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. కొత్తగా నియమించిన వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. ఇక మీదట తాహశీల్దారులు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు తనిఖీ చేస్తారని చెప్పారు. ఆసుపత్రులలో మందులు కొరత ఉంటే తెలియజేస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి బి.సుజాత, అదనపు జిల్లా వైద్యాధికారి లీలా ప్రసాద్, వైద్యాధికారులు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.










