ప్రజాశక్తి-జి.మాడుగుల: మండలంలోని పాలకొండ, యం.నిట్టాపుట్టు అంగన్వాడి కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్ బాషా శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఆయన జి.మాడుగుల ఆరోగ్య కేంద్రంను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్‌ఒ మాట్లాడుతూ, గర్భిణిలకు సకాలంలో గుర్తించి తనిఖీల నిర్వహించాలన్నారు. కాన్పునకు సిద్ధంగా ఉన్న గర్భిణిలను బర్త్ వెయిటింగ్ హౌమ్‌లలో చేర్పించి సుఖ ప్రసవాలు జరిటేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. పిహెచ్‌సిలో రోజు వారి సుఖప్రసవాలపై సంతృప్తి వ్యక్తం చేసారు. తల్లిపాల ప్రాముఖ్యత, తల్లి పాలు పట్టే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గర్భిణిలకు, శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు నిర్వహిస్తున్న పాలకొండ, యం.నిట్టాపుట్టు అంగన్వాడి కేంద్రాలను తనిఖీలు చేశారు. గర్భిణీలకు, శిశువులకు సకాలంలో వ్యాది నిరోధక టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలింతలకు, శిశువులకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సేవలపై అంగన్వాడీ, ఆశా కార్యాకర్తలకు అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీటి ద్వారా డయేరియా, డిసెంట్రీ, టైఫాయిడ్, కామెర్లు వ్యాధులు ప్రభలే అవకాసం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిలువ ఉంచిన ఆహార పదార్ధాలు తినరాదని, వేడిగా ఉన్నప్పుడే బుజించాలని తెలిపారు. పరిశుభ్రమైన కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఎ.పి హెల్త్ యాప్ లో పొందుపరుస్తున్న రిపోర్టులను పరిశీలించారు. యం.నిట్టాపుట్టు లో 104 వాహనం ద్వారా నిర్వహించిన హెల్త్ క్లినిక్‌ను పరిశీలించారు. రోగులకు అందించిన చికిత్సలను వైధ్యాధికారికి అడిగి తెలుసుకున్నారు. మందులను, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యాక్రమంలో వైద్యాధికారులు శశికాంత్, విగేష్, బాలమురళీకృష్ణ, పాడేరు ఎపిడమిక్ సెల్ ఆరోగ్య విస్తరణ అధికారి గుల్లేలి సింహాద్రి, ఆరోగ్య విస్తరణ అధికారి ఎన్.ప్రకాశరావు, వైద్య సిబ్బంది, ఆశా కార్యాకర్తలు పాల్గొన్నారు.










