Oct 10,2023 19:38

మాతా శిశు మరణాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:

మాతా శిశు మరణాలు జరగకుండా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం సమావేశ మందిరంలో రెండు నెలల్లో చోటు చేసుకున్న మాతా శిశు మరణాలపై సమీక్షించారు. ఆగస్టు-సెప్టెంబర్‌ నెలలో 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో చోటు చేసుకున్న ఐదు శిశు, ఒక మాత మరణాలపై జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడి కార్యకర్తలతో ముఖాముఖిగా చర్చించి భవిష్యత్‌లో మాతాశిశు మరణాలు జరగకుండా, నివారణ చర్యలు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ స్థాయిలోని హైరిస్క్‌ గర్భవతులకు అన్ని పరీక్షలు నిర్వహించి ప్రణాళిక ద్వారా కాన్పుకు వారం రోజులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, వారికి ఆర్థిక, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. మొదటిసారి గర్భం దాల్చిన గర్భవతులపై వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. బిడ్డబిడ్డకు కనీసం మూడు సంవత్సరాలు కాలవ్యవధి ఉండేలా ఏఎన్‌ఎంలు గర్భవతులకు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని, కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులను అవలంబించేటట్లు చేయుట ద్వారా మాత శిశుమరణాలను తగ్గించాలన్నారు. తల్లికి అధిక రక్తపోటు, రక్తహీనత, పౌష్టికాహార లోపం వలన కాన్పు సమయంలో జరిగే శిశు మరణాలను వైద్యాధికారులు ముందస్తు ప్రణాళికల ద్వారా నివారించాలని, సరైన పద్ధతిలో కౌన్సిలింగ్‌ చేయాలని తెలియజేశారు. కాన్పు అయిన తరువాత వైద్యులు వైద్యసిబ్బంది బాలింతలను సందర్శించి తల్లీబిడ్డ ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన చికిత్సలు అందించి మాతాశిశు మరణాలు జరగకుండా చూడాలన్నారు. జిల్లా ఆసుపత్రి నందు అవసరమైన డాక్టర్స్‌ మరియు సిబ్బందిని నియమించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఒ ప్రభావతిదేవి, డిసిహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, నోడల్‌ అధికారి డాక్టర్‌ రవిరాజు సంబంధిత వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.