May 24,2023 22:56

అధికారులు సమీక్షిస్తున్న డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ రమేష్‌



ప్రజాశక్తి - కాకినాడ
జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు వైద్య, స్త్రీశిశు సంక్షేమ శాఖలు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఆర్‌.రమేష్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌ వివేకానంద సమావేశ హాలులో గర్భస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టం అమలు, మాతా, శిశు మరణాల సమీక్ష, నివారణపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఆర్‌.రమేష్‌ అధ్యక్షతన జరిగాయి. సమావేశంలో తొలుత 2023 తొలి త్రైమాస కాలంలో జిల్లాలో జరిగిన 4 మాతా మరణాలు, 5 శిశు మరణాలకు వాస్తవ కారణాలు, అటువంటివి పునరావతం కాకుండా చేపట్టవలసిన చర్యలపై ఆడిట్‌ నిర్వహించారు. జిల్లాలో హైరిస్క్‌ గర్భధారణ గుర్తించిన మహిళల ఆరోగ్య స్థితిపై ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు నిరంతర పర్యవేక్షణ పాటించి, ఆసుపత్రిలో సురక్షితంగా ప్రసవించి తల్లీ, బిడ్డ క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్లేలా చూడాలని ఆయన కోరారు. ముఖ్యంగా రక్తహీనత కారణంగా గర్భిణులకు ఆరోగ్య సమస్యలు తలెక్తకుండా, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, పౌష్టికాహరం సక్రమంగా తీసుకునేలా ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు స్వయంగా పర్యవేక్షించాలని సూచిం చారు. సురక్షిత ప్రసవం కావడానికి గర్భిణులు పాటించ వలసిన జాగ్రత్తలపై వైద్య అధికారులు, ఐసిడిఎస్‌ అధికారులు సంయు క్తంగా అవగాహన కార్యక్రమాలు జిల్లాలో స్థాయిలో నిర్వహించా లన్నారు. ప్రతి గర్భిణి ఇంటి వద్ద కాకుండా, వైద్య పర్యవేక్షణలో ఆసుపత్రిలోనే పురుడు పోసుకునేలా కార్యకర్తలు చూడాలన్నారు.
అనంతరం జరిగిన గర్భస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టం అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో క్రొత్తగా 5 ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు, రెండు స్కానింగ్‌ సెంటర్లకు అనుమతుల పునరుద్ధరణ, 3 స్కానింగ్‌ సెంటర్లలో పరికరాలు, అడ్రస్‌ మార్పులకు కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే జిల్లాలో ఆడ శిశు జననాల సంఖ్య తక్కువగా నమోదౌతున్న ప్రాంతాల్లోని స్కానింగ్‌ సెంటర్లపై నిశిత నిఘా ఉంచి, అనుమానిత సెంటర్లలో పోలీస్‌ శాఖ సమన్వయంతో రహస్యంగా డెకారు ఆపరేషన్‌లు నిర్వహించాలని డిఎంహెచ్‌ఓ మండల, డివిజన్‌ కమిటీలను కోరారు. గర్భస్థ లింగ నిర్థారణ నిషేధంపై చట్టంలో నిర్థేశించిన అంశాలను అన్ని స్కానింగ్‌ కేంద్రాల్లో బోర్డులపై ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో ఐసిడిఎస్‌ పీడీ కె.ప్రవీణ, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పి.బి.విష్ణువర్థని, ఆర్‌బిఎస్‌కె కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్యనా రాయణ, జిజిహెచ్‌ గైనిక్‌ విభాగా ధిపతి డాక్టర్‌ లావణ్యకుమారి, పిడియాట్రీషియన్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రాజు, డిపిహెచ్‌ఎంఓ పి.వి. రమణమ్మ, డెమో సి.హెచ్‌.రాజు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చక్రవర్తి, బీబీ సఫూరా, వైద్యాధికారులు, ప్రయివేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.