Feb 27,2023 21:55

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
            జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా, వీటి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖాధికారులపై ఉందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో మాతా, శిశు మరణాలపై కలెక్టర్‌ వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాతా, శిశు మరణాలపై సమీక్ష జరిపి మాతృ మరణాలకు దారితీసిన కారణాలపై సంబంధిత వైద్యాధికారుల నివేదికలను పరిశీలించారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్నారు. గర్భిణులకు చికిత్స విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని ముఖ్యంగా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకూ అన్ని పరీక్షలతో పాటు వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయా లను తెలియజేయాలన్నారు. ఇదే సమయంలో వారి ఆరోగ్యస్థితిని కూడా ఎప్పుడూ గమనిస్తూ ఉండాలన్నారు. ఈ విషయంలో వైద్యాధికారి నుంచి ఎఎన్‌ఎం, ఆశా, తదితర సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉంటే మాతా, శిశు మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో గర్భిణుల్లో సాధారణంగా కనిపించే రక్తహీనత, అధిక రక్తపోటు సమస్యలను త్వరగా గుర్తించి తగు సూచనలను సంబందిత వైద్యాధికారులు ఎప్పటికప్పుడు అందించడం ద్వారా మరణాలను అరికట్టొచ్చన్నారు. వైద్య సిబ్బంది గర్భిణులకు, బాలింతలకు అందించే సేవల్లో ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తే మాతా, శిశు మరణాలను నిలువరిం చవచ్చని చెప్పారు. గర్భందాల్చిన మహిళ పుట్టింటికి వెళ్లిన సమయంలో కూడా ఆమె ఆరోగ్య పరిస్ధితిని ఎఎన్‌ఎంలు పరిశీలించాలన్నారు. హైరిస్కు కేసులు ముందస్తుగా గుర్తించి ప్రత్యేకదృష్టిసారించాలని ముఖ్యంగా రాత్రి సమయంలో మరణాలు సంభవించకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాల న్నారు. హై రిస్కు కేసుల్లో గర్భందాల్చిన మహిళలకు 34వ వారం నుంచి ప్రతీవారం వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన రీతిలో ఎంఎల్‌హెచ్‌పిలకు శిక్షణ అందించా లన్నారు. మాతా శిశు మరణాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అనుసరించాల్సిన పద్ధతులపై కొత్తగా వచ్చిన జూనియర్‌ డాక్టర్లకు సీనియర్‌ డాక్టర్లతో సమగ్ర శిక్షణ అందించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డి.ఆశ, డిఐఒ నాగేశ్వరరావు, ఆర్‌ఎంఒ పి.శ్రీనివాసరావు, గైనకాలజిస్ట్‌ పద్మ పాల్గొన్నారు.