ప్రజాశక్తి-పాడేరుటౌన్:జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకూడదని, వీటి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జమాల్ భాషా వైద్యాధికారులను ఆదేశించారు. అక్టోబర్ నెలలో జరిగిన మాతృ మరణాలకు దారి తీసిన కారణాలపై గురువారం ఆయన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాతా, శిశు మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మాతృ మరణాలు సంభవించ కూడదని ఒకవేళ జరిగితే పక్కా విశ్లేషణ ఉండాలన్నారు. మరణాలు జరగడానికి సౌకర్యాలలోపమా, వైద్య సేవలు లోపమా, సామాజికపరమైన అంశాలు ఉన్నాయా అనే కారణాలను విశ్లేషించాలని స్పష్టం చేశారు. గర్భిణీలు ప్రసవ సమయంలో మీతి చెందితే అందుకు గల నిర్దిష్టమైన కారణం కనుగొనాలని స్పష్టం చేశారు. గర్భిణీల ఆరోగ్యం పట్ల పిహెచ్‌సి వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, గైనకాలజిస్టు, పిడియాట్రిషన్, జిల్లా నోడల్ అధికారి, వైద్యాధికారులు పాల్గొన్నారు.










