ప్రజాశక్తి-పార్వతీపురం : ఇచ్చిన మాట తప్పిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి తగిన మూల్యం తప్పదని ఫ్యాప్టో, ఎపిసిపిఎస్‌ఇఎ నాయకులు హెచ్చరించారు. సోమవారం స్థానిక డిఇఒ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఫ్యాప్టో, ఎపిసిపిఎస్‌ఇఎ ఆధ్వర్యాన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మురళీమోహన్‌రావు మాట్లాడుతూ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేసి, ఒపిఎస్‌ను తీసుకొస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మాటతప్పారని, మడుమతిప్పారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆదరించి జగన్‌ను గెలిపిస్తే వారిని మోసం చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని, ఇపుడు ఆర్థిక ఇబ్బందులంటూ తప్పించుకోవడం సిగ్గుచేటని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ వి.ధనుంజరునాయుడు అన్నారు. అసెంబ్లీలో జిపిఎస్ బిల్లు తీసుకొస్తే ఎమ్మెల్యేలందరికీ తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సిపిఎస్ ముగిసిన అధ్యాయమన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాటలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే మంత్రి అధ్యాయమే ముగుస్తుందని జెఎసి చైర్మన్ జి.కిశోర్ హెచ్చరించారు. నాయకులు సంతోష్ కుమార్, ఎన్.బాలకృష్ణ, వి.తవిటినాయుడు మాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దు చేసి, ఒపిఎస్‌ను తీసుకురాకుంటే, భవిష్యత్తులో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. వీరి ఆందోళనకు పింఛనుదారుల సంఘం నాయకులు గణపతి మద్దతిచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సత్యనారాయణ, అనిల్, సింహాచలం, రమేష్ పాల్గొన్నారు.










