Jul 16,2023 01:52
సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు

ప్రజాశక్తి-చీరాల: రాష్ట్రంలో లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, స్కీం వర్కర్లు కనీస వేతనాలు అమలు కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు తమ రాష్ట్రంలో అమలు చేస్తానని హామీ ఇచ్చి నేటికీ నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఇచ్చిన హామీని అమలు చేయలేదని హామీలు విస్మరించి సీఎం జగన్మోహన్‌ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం చీరాల మండలం వాడరేవు కె పాల్‌ గెస్ట్‌ హౌస్‌లో సిఐటియు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరుగుతున్న బాపట్ల జిల్లా వర్క్‌ షాప్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్లకు రూ.13,500 జీతం ఇస్తున్నారని, అయితే అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని పోరాటాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం మన రాష్ట్రంలో రూ.14,500 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.11,500 మాత్రమే ఇవ్వడం పట్ల కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిన్నచూపు చూస్తుందో అర్థమవుతుందని అన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అందరూ ఒకటే అంటూ మాటలు చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి నేడు కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే పర్మినెంట్‌ చేస్తున్నట్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారని, తక్షణమే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా పర్మినెంట్‌ చేయాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘ నేతలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు వేలాది మంది రోడ్లపైకి వచ్చి తమ బాధను వెళ్లబోసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్రలోనే ఉందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా యూనివర్సిటీ ఇతర రంగాలలో పనిచేస్తున్న చిరు ఉద్యోగులందరూ తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ అవుతాయని ఎన్నో కలలు కన్నారని అయితే లక్షలాది మందిని ఆప్కాస్‌లో పేరుతో వారిని బానిసత్వంలోకి నెట్టేస్తున్నారని ఆప్కాస్‌ నుంచి బయటపడేసి తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేసి రక్షణ కల్పించాలని వారు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు కె ధనలక్ష్మి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు. ఎన్నికలకు ముందు కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన జగన్‌ మోహన్‌రెడ్డి గెలిచాక ప్రస్తుతం ఆ మాటను పూర్తిగా విస్మరించాలన్నారు. దీంతో చాలీచాలని జీతాలతో రాష్ట్రంలో కార్మికులందరూ ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అన్నారు. మరి కొంతమందికి అయితే చేసిన పనికి జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని దీంతో ఆ కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి సిహెచ్‌ మజుందార్‌, జిల్లా నాయకులు కె వసంతరావు, ఎన్‌ బాబూరావు, సిహెచ్‌ గంగయ్య, పి రేఖ ఎలిజిబెత్‌, తిరుమలరెడ్డి, శ్యామ్యూలు, ప్రతాప్‌, వీరాంజనేయులు, శారద తదితరులు పాల్గొన్నారు.