Feb 02,2023 00:15

మృతురాలి భర్తను ఓదార్చుతున్న గిరిజన సంఘం నేత

గిరిజన సంఘం డిమాండ్‌
ప్రజాశక్తి మారేడుమిల్లి

వై.రామవరం మండలం, దదలికవాడ గ్రామంలో రక్త స్రావంతో ఓ గర్భిణి చనిపోయిన సంఘటన చాలా విచారకరమని, ఏజెన్సీలో మాతా శిశు మరణాలు అరికట్టాలని గిరిజన సంఘం జిల్లా నాయకులు సాదల విద్యాసాగర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని సర్పంచ్‌ జర్త కృష్ణ రెడ్డి, మాజీ సర్పంచ్‌ పల్లాల అబ్బాయి రెడ్డి, పల్లాల పెద అబ్బాయి రెడ్డి, ఎంపిటిసి కెచ్చేలా శ్రీను బాబు, కెచ్చేలా అచ్చిరాజు, జర్త విజయకుమార్‌ తదితరులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ రెడ్డి మాట్లాడుతూ విపరీతంగా రక్తస్రావంతో చనిపోయినా కుమారి కుటుంబాన్ని, ముగ్గురు చిన్న పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సకాలంలో గిరిజనులకు వైద్యం అందడం లేదని, ప్రభుత్వం, ఐటిడిఎ, వైద్యాధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏజెన్సీలో మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. దదిలిక వాడ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీరు సరిగ్గా లేవని తెలిపారు. అధికారులు వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకుంటే గ్రామస్తులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.