ప్రజాశక్తి- గాజువాక : ఇంటి పెద్దదిక్కు మృతితో అనాథలైన పిల్లల చదువుకు అండగా ఉంటానని భరోసానిచ్చిన 74వ వార్డు కార్పొరేటర్, వైసిపి సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి తన మాటను నిలబెట్టుకున్నారు. ఐదు నెలల క్రితం వార్డు పరిధిలోని గోరుసు రాజేష్‌కుమార్ మరణంతో దిక్కులేకుండా పోయిన వారి కుటుంబాన్ని అప్పట్లో పరామర్శకు వచ్చిన వంశీరెడ్డి, పిల్లలను పదో తరగతి వరకు తాను చదివిస్తానన్న మాటకు కట్టుబడి, శుక్రవారం రాజేష్‌కుమార్ ఇద్దరు పిల్లలను ఒకరిని ఎల్‌కెజిలోనూ, మరొకరిని ఒకటో తరగతిలోనూ స్థానిక టిఎస్‌ఆర్ టాలెంట్ స్కూల్‌లో దగ్గరుండి చేర్పించారు. వారికి పదోతరగతి వరకు చదువుకు అయ్యే మొత్తం ఖర్చును తాను భరిస్తానని మరోమారు స్పష్టం చేశారు. ఇచ్చిన మాటను నిలుపుకున్న వంశీరెడ్డినిపిల్ల తల్లి జ్యోతితోపాటు వారి కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. కాగా రాజేష్‌కుమార్ కుటుంబానికి ఇదివరకే డ్వాక్రా సంఘ సభ్యులు సామాజిక బాధ్యతగా సమకూర్చిన రూ.23వేలు నగదు సాయాన్ని అప్పట్లో వంశీరెడ్డి అందజేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో వైసిపి నేతలు గోరుసు సత్యం, గోందేశి సత్తిరెడ్డి, పూతి తాతారావు, గొరుసు రామలక్ష్మి, వార్డు సిఒ సూర్యనారాయణ, ఆర్‌పిలు హైమావతి, సుధ, సత్య, వరలక్ష్మి, గురమ్మ, గోందేశీ అప్పలరెడ్డి, సత్తిరెడ్డి, తులసి, భులాక, కోటి, బాలు పాల్గొన్నారు.










