Sep 29,2023 22:19

ఏరును తలపిస్తున్న తిరుపతి - రేణిగుంట రహదారి

'ఏరు'ను తలపిస్తున్న తిరుపతి - రేణిగుంట రహదారి
'మాస్టర్‌' ప్లాన్‌ 'చెరువులు'
ప్రజాశక్తి - తిరుపతి సిటి
'వానజల్లు కురిసిందంటే చాలు... తిరుపతి రహదారులు ఏరులను తలపిస్తాయి. 18 మాస్టర్‌ ప్లాన్‌లను నిర్మించిన కార్పొరేషన్‌, పాత రహదారులపై నిలిచిపోతున్న మురుగునీటిని తొలగించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఈ కారణంగా పాత రహదారులన్నీ చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తాయి. డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండటం వల్ల చిన్నపాటి వర్షానికి భూగర్భజలం పొంగి ప్రవహిస్తుంది. తిరుచానూరు, లీలామహల్‌, రేణిగుంట ఆటోనగర్‌, చేపల మార్కెట్‌ రహదారులు చిత్తడి చిత్తడిగా నడవడానికి వీల్లేకుండా ఉంటాయి. ఆటోలు, కారులు వెళుతుంటే పాదచారులపై మురుగునీరంతా చిమ్ముతుంది. అంతెందుకు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుటే రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద రహదారి ఏళ్ల తరబడి నీరు నిలిచిపోతూ కార్పొరేషన్‌ లీలలకు మచ్చుతునకగా కనిపిస్తుంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికులు ఎక్కువగా జంక్షన్‌ ప్రాంతమైన రేణిగుంట రైల్వేస్టేషన్‌కు వస్తుంటారు. అక్కడ నుంచి వివిధ వాహనాల ద్వారా తిరుపతిలోకి ప్రవేశిస్తారు. తిరుపతిలోకి ప్రవేశించే ముందే డ్రైనేజీ నీరు వారికి స్వాగతం పలుకుతుంది. తిరుపతి-రేణిగుంట ప్రదాన మార్గంలోని పూలవానిగుంటకు వెళ్లే సర్కిల్‌ వద్ద డ్రైనేజీ అస్థవ్యస్తంగా తయారైంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రధాని రహదారి మొత్తం మురికినీటితో నిండిపోతోంది. రోడ్డుపై సుమారు 2 అడుగుల ఎత్తు వరకు మురికినీరు ప్రవహిస్తుండడంతో అటుగా వెళ్లే వాహనదారులకు, పాదాచారులకు అవస్థలు తప్పడం లేదు. పైగా ఆ చుట్టుపక్కల పలు ప్రముఖ కంపెనీల బ్రాంచీలు, వ్యాపార సముదాయాలు, నివాస గృహాలు ఉండడంతో డ్రైనేజీ నీటి ద్వారా వచ్చే దుర్గంథాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక ఏ చిన్నపాటి చినుకులు పడినా పరిస్తితి ఆధోగతే. రోజు ఆ దారిన వేలాది వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లాకు అధికార యంత్రాంగం అదే దారిన వెళుతుంటారు. కార్పొరేషన్‌ అధికారులు ప్రజాప్రతినిధులు నిత్యం ఆదారిలో పయనిస్తుంటారు. కానీ ఎవ్వరు దీన్ని బాగు చేయాలని భావించకపోవడం బాధాకరం. తిరుపతి అభివృద్ధి బాట పట్టాలని నగరంలోని ప్రధాన రహదారులన్ని విస్తరింప చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మన్ననలను పొందేందుకు ప్రయత్నిస్తున్న కార్పొరేషన్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు తిరుపతికి ప్రవేశించే ప్రదాన రహదారిలో మురికినీరు నిల్వ ఉంటున్నా పట్టించుకోకపోవడం శోచనీచయం. స్థానికులు అనేక సార్లు కార్పొరేషన్‌ అధికారులకు, కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా, ఆఖరికి స్పందనలో ఫిర్యాదు చేసిన తూతూమంత్రంగా తాత్కాలకంగా చేశామనిపిస్తున్నారు. తిరిగి రెండు రోజులకు యాథప్రకారమే అవుతోంది. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు స్పందించి అక్కడ మురికినీరు వెళ్లేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఏరును తలపిస్తున్న తిరుపతి - రేణిగుంట రహదారి