May 16,2021 13:48

అనగనగా ఒక ఊళ్లో ఆనంద్‌ అనే యువకుడు తన చెల్లి, తల్లితో కలిసి ఉండేవాడు. తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబభారం ఆనంద్‌ పైనే పడింది. ఆనంద్‌ చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అనుకోకుండా వింత జబ్బు ప్రపంచాన్ని వణికించసాగింది. దీంతో ఆనంద్‌ వ్యాపారం సాగలేదు. దీంతో దిగాలుగా ఇంట్లో కూర్చుని ఆలోచించసాగాడు.
అంతలో ఏదో గుర్తొచ్చినట్టు.. బయటికి వెళ్ళాడు. కొంచెం గుడ్డను, సాగే దారాన్ని కొనుక్కుని ఇంటికొచ్చాడు. అమ్మ, చెల్లి సాయంతో మాస్కులు తయారు చేశాడు. అన్నీ సంచిలో సర్దుకుని పక్క గ్రామానికి వెళ్ళాడు.
''మాస్కులమ్మో.. మాస్కులు.. దుమ్ము తగలదు.. ధూళి అంటదు.. పక్కవాళ్ళు దగ్గినా తుమ్మినా రక్షణగా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోగాన్ని తరుముతుంది.. రండమ్మా రండి...'' అని కేకలేస్తూ అమ్మసాగాడు. చాలా మంది మాస్కులు కొన్నారు.
మధ్యాహ్నం కావొచ్చింది. ఆనంద్‌కి ఆకలి వేసింది. రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టు కింద కూర్చొని ఇంటినుంచి తెచ్చుకున్న భోజనం తిన్నాడు. అలసటగా అనిపించి, చెట్టు నీడన సేదతీరాడు. నిద్ర ముంచుకొచ్చేసింది.
ఆ చెట్టు మీద వున్న కోతి ఒకటి ఆనంద్‌ పెట్టుకున్న మాస్కు చూసింది. వెంటనే కిందికి దిగి సంచిలో వున్న మాస్కు తీసుకుని తానూ పెట్టుకుని చెట్టు పైకి ఎక్కింది. మిగతా కోతులన్నీ ఒక్కొక్కటిగా కిందికి వచ్చి మాస్కు తీసుకుని చెట్టు పైకి ఎక్కాయి. దీంతో సంచి ఖాళీ అయింది.
కొంతసేపటి తరువాత ఆనంద్‌కి మెలకువ వచ్చింది. చూస్తే సంచిలో ఒక్క మాస్క్‌ కూడా కనిపించలేదు. ఏమైనట్టూ అని చుట్టూ వెతికాడు. ఎవరో దొంగలించారు అనుకుని... అనుకోకుండా చెట్టు కొమ్మలవైపు చూశాడు. ఆశ్చర్యం వేసింది. మూతులకు మాస్క్‌లు తగిలించుకుని దర్జాగా కొమ్మలపై కూర్చున్నాయి కోతులు. ''ఇదేం విడ్డూరం? ఇప్పుడేం చేయాలి?'' అనుకుంటూ తల గీరుకున్నాడు. కోతులు కూడా గీరుకున్నాయి. ''అరె ఇదేదో బావుందే'' అనుకుని మళ్లీ గీరాడు. అవి కూడా అలానే చేసాయి. అప్పుడు ఆనంద్‌కు ఒక ఆలోచన వచ్చింది.
వాటి వైపు తిరిగి వెక్కిరించాడు. అవి కూడా వెక్కిరించాయి. ఎగిరాడు. అవి కూడా ఎగిరాయి. మూతికున్న మాస్కు తీసి, గిరగిరా తిప్పాడు. అవీ అలాగే చేసాయి. మాస్కు తీసి కిందికి విసిరేసాడు. అవి కూడా కిందికి విసిరేసాయి. వెంటనే ఆనంద్‌ వాటిని గబగబా ఏరుకుని సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది పాత కథే. మాస్కు తొడుక్కొని కొత్తగా వచ్చిందన్న మాట!

- రజిత కొండసాని
96528 38920