Aug 01,2021 07:30
  • మాస్కులేని వారి గురించి తెలిపేందుకు వాట్సాప్‌ నెంబరు విడుదల

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :  ఎవరైనా మాస్కు పెట్టుకోకుండా కనిపిస్తే వెంటనే 8010968295 నెంబరుకు ఫోన్‌ చేసినా లేదా ఫొటో తీసి వాట్సాప్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ కమిషనరు కాటంనేని భాస్కర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మాస్కు లేకుండా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాస్కులేని వారిని అనుమతించే కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, సంస్థలు, దుకాణాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమానాతోపాటు రెండు మూడు రోజులు దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు నేపథ్యంలో వీటిని పాటించాలని సూచించారు. మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్‌ఐ ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పటి వరకూ ఆ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండేదని స్పష్టం చేశారు.