ప్రజాశక్తి-పర్చూరు : ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ తెలిపారు. స్థానిక బిఎఆర్ అండ్ టిఎ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. బాపట్ల జిల్లాలో 115 జూనియర్ కళాశాల నుంచి జూనియర్ ఇంటర్ విద్యార్థులు 8,759 మంది, సీనియర్ ఇంటర్ విద్యార్థులు 10,474 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. బాపట్ల పరిధిలో 34 కేంద్రాలలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. పరీక్షలు సజావుగా సాగడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను రెండు బందాలుగా నియమించినట్లు తెలిపారు. మరో రెండు సిట్టింగ్ స్క్వాడ్ బందాలను కూడా నియమించినట్లు తెలిపారు.క్లంబింగ్ సెంటర్లకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఓ అధికారిని స్పాట్ ఆఫీసర్‌గా ఏర్పాటు నియమించినట్లు కలెక్టర్ వివరించారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు లీక్ గాకుండా భద్రతపై అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థుల వివరాలు తక్షణమే పంపాలన్నారు. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలతో పాటు మిగిలిపోయిన ప్రశ్నాపత్రాలను భద్రంగా స్ట్రాంగ్ రూములకు తరలించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రశ్నాపత్రాల భద్రత, ప్రాథమిక వైద్య శిబిరం, సిబ్బంది పనితీరు, పరిసరాల పరిశుభ్రత, స్క్వాడ్ పనితీరును కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు బాగా రాయాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఆర్‌ఐఓ కె.ఆంజనేయులు, పర్చూరు తహశీల్దారు నెహ్రూబాబు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ భవాని, ప్రిన్సిపల్ రత్నకుమారి, ఎస్‌ఐ చెంచు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చీరాల : ఇంటర్ పరీక్షా కేంద్రాలను తహశీల్దారు ప్రభాకర్‌రావు పరిశీలించారు. విజ్ఞాన భారతి, గౌతమి కళాశాలలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. నాగులుప్పలపాడు : మండల పరిధిలోని ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం జరిగాయి. మొత్తం 200 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 177 మంది హాజరయ్యారు. 23 మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ రంగనాయకులు తెలిపారు.కంభం రూరల్ : ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమ య్యాయి. కంభం పట్టణంలోని వాసవీ, సాధన, గౌతమి, తురిమెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కంభం సిఐ ఎం. రాజేష్ కుమార్, కంభం ఎస్‌ఐ వి . నాగ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.










