Aug 27,2021 06:12

ఈ ఛానళ్ళకు ప్రజలు పట్టరు. జీవితపు విలువలు నిలబెట్టాలని వుండదు. అన్ని రకాలుగా చచ్చిపోతున్న మనిషిని ఎలా బతికించుకుందామన్న ధ్యాస వుండదు! వ్యాపార ప్రకటనలతో డబ్బు సంపాదించుకుంటూ, రేటింగ్‌ పెంచుకోవాలి. అంతే! ఒకవైపు రాజకీయ నాయకులు. మరోవైపు ఛానళ్ళూ నరుక్కుంటూ వస్తుంటాయి. తప్పించుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేక బలి అయ్యేది సగటు ప్రేక్షకులే.
     ''ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు-అన్నట్టుగా కుటుంబాలను చిన్నాభిన్నం చేసే టీవీ సీరియళ్ల వల్ల లాభమేమిటీ? వీటి వల్ల సమాజంలో నైతిక విలువలు పతన మవుతున్నాయి. నిత్యం టీవీలకు అతుక్కుపోవడం వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. విలువైన సమయం వృధా అవుతోంది. చెడు ఆలోచనలతో మెదడు పాడవుతోంది. సీరియళ్లు చూడటం ఒక వ్యసనంగా మార్చుకున్న వారు బయట పడటానికి ఇతర వ్యాపకాల్లో తీరికలేకుండా ఉండటం మేలు!'' అంటారు ఎల్‌ఐసి అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కె. శాంతిలక్ష్మి.
    జీవిత బీమా అధికారిణి ఆలోచనల్లో నిజాయితీ ఉంది. తెలుగు సీరియళ్ల తీరుతెన్నులు క్షుణ్ణంగా గమనించిన తర్వాతే, ఆవిడ అలా వ్యాఖ్యానించారు. ఉదాహరణకు కన్నకూతుర్ని ఎలా నాశనం చేయాలో ఒక పువ్వు సీరియల్‌ చూపింది. పనిమనిషి కోడలైతే ఎలా ఏడిపించాలో ఒక రాజకుమారి సీరియల్‌ చూపింది. తండ్రి నుండి కూతుర్ని ఎలా విడదీయొచ్చో ఒక అమ్మ సీరియల్‌ చూపింది. అత్తగారు కోడల్ని ఎలా చంపుతుందీ అంటే ఓ కళ్యాణం సీరియల్‌ చూపింది. ఇవికాక సీరియళ్ల ద్వారా మత ప్రచారం కూడా జరుగుతోంది. అవసరమున్నా లేకున్నా విగ్రహాల ముందు, పటాల ముందు పెద్ద ఎత్తున పూజలు, నేపథ్యంలో సినిమా పాటలు.
     ఒకప్పటి మగ విలన్లను తలదన్నే విధంగా కుట్రలు, కుతంత్రాలతో ఆడ విలన్లు కథలో చక్రం తిప్పుతుంటారు. పెద్ద బంగళా ముందు లాన్లో కూర్చుని ఇంట్లోవాళ్ళని, బయటివాళ్ళని గడగడ లాడించడం, రోల్డుగోల్డు నగలు దిగేసుకుని ఆర్డర్లు వేస్తూ ఉండటం జరుగుతుంటుంది. 'అంతేగ, అంతేగ' అంటూ భర్తలు ఆ ఆడ విలనీల వెనక పిల్లులవుతుంటారు. మంచీ, మన్ననా లేక, ఒక మంచి సందేశమూ లేక, ద్వేషాల చుట్టూ, పగల చుట్టూ తిరిగే తెలుగు సీరియళ్లు 'ఎంత బావుంటాయీ?' ఎంత రక్తి కట్టిస్తాయీ? ''మనిషి ఆకారంలో తిరిగే క్రూర జంతువులతో కాకుండా... సీరి యళ్లను కాస్త మనుషులతో తీయండ్రా బాబూ!'' అని కొందరు పిచ్చివాళ్ళు గగ్గోలు పెడుతుంటారు-అది వేరే విషయం!
    ఇక రియాల్టీ షోల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆపకుండా తెగ వాగే వాళ్ళే గొప్ప యాంకర్లవుతారట! పిచ్చి వాగుడుకు, పచ్చి జోకులకు వాళ్ళే పగలబడి నవ్వుతుంటారు. పైగా వాళ్ళకు వాళ్ళే సెలబ్రిటీలమని ప్రకటించుకోవడం తెలుగు ప్రేక్షకుల దౌర్భాగ్యమా? అదృష్టమా?
    ఇక వేర్వేరు రంగాలకు చెందిన ఓ పదిహేను మందిని ఓ వంద రోజులు ఓ ఇంట్లో బంధించి, వారి సొళ్ళు కబర్లు, గిల్లికజ్జాలు, కొట్లాటలు, నిద్ర మొహాలు, అర్థనగ శరీరాలు టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? ఆరోగ్యవంతుల మెదళ్ళను మొద్దుబారించడం తప్ప. బద్దకస్తుల సంఖ్య గణనీయంగా పెంచడం తప్ప. ఏమిటి? ఏమిటీ లాభం? విశ్రాంతి ఎక్కువగా దొరికే వారికి ఏదో కాలక్షేపం తప్ప. ఎవరికి లాభం? విజ్ఞత లేని వాళ్ళ జాతర లైవ్‌లో చూపించడమే బిగ్‌ షోనా? ఎయిత్‌ సెన్స్‌-మెగుడు పెళ్ళాలు వంటి కార్యక్రమాలన్నీ హడావుడికి తప్ప, దేనికి పనికొచ్చేవి? దేశవ్యాప్తంగా ఉన్న తెలివైన విద్యార్థులను ఒక చోట చేర్చి వారి సృజనాత్మకతను ప్రోత్సహించి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లేదా వంద మంది యువ ఇంజనీర్లను ఒక చోట చేర్చి ఒకటి రెండు నెలల్లో కొత్త ఉత్పత్తులకు రూపకల్పన చేయమనండి. అదీ కాకపోతే ఓ పది మంది రైతులను గుర్తించి, వారికి అన్ని సౌకర్యాలు, పరికరాలూ అందించి కొత్త పద్ధతుల ద్వారా పంటలు పండించమనండి. పండించి చూపుతారు. దేశంలో దేనికీ కొదవ లేదు. అందించాల్సిన వారికి ఆదరణే కొరవడింది. పనికిరాని వాటికి ప్రాముఖ్యతనిస్తూ, పనికొచ్చేవి పక్కన పడేయడం మూలాన దేశ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది.
      ఇక తెలుగు టెలివిజన్‌ వార్తా ఛానళ్ళలో 'చర్చ' పేరుతో వాదనలు జరుగుతుంటాయి. చర్చ వేరు. వాదన వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. వాదనకు దిగడమంటే బురద పూసుకుని ఉన్న వ్యక్తితో కుస్తీకి దిగడం లాంటిది. వాదన లౌక్యం తెలియని వారి లేదా మొండివారి సాధనం. ఒక్కోసారి వాదనలో విషయం ఉన్నా...అది వ్యక్తీకరించే పద్ధతి వల్ల ఎదుటివారికి అంగీకారం కాదు. ఎందుకంటే ఎదుటివారికి ఏమీ తెలియదన్నట్టు, అంతా తమకే తెలుసునన్నట్టు...ఒక రకమైన అజ్ఞానంతో కొనసాగేదే వాదులాట. అసహనానికి చిహ్నంగా, అసహ్యంతో విదిలించుకున్నట్టు ఉండేదే వాదన! చర్చనేది వేరు. అది జ్ఞానాన్ని పంచుకోవడం లాంటిది. అది మానసిక పరిణతి ఉన్నవారి మధ్య సాగేది. ఎదుటివారి భావనల్లో, ఆలోచనల్లో ఉన్న లోపాల్ని, పొరపాట్లను సున్నితంగా ఎత్తిచూపడం. ఒక సూచన చేయడం చర్చలో జరుగుతుంది. తర్కబద్ధంగా చర్చ జరిగినప్పుడు ఒకరి పట్ల ఒకరికి గౌరవం పెరుగుతుంది. అసహ్యంగా విదిలించుకోవడం కాదు. అతిథికి ఆతిథ్యం ఇవ్వడం లాంటిది చర్చ. ఇక్కడ మన తెలుగు ఛానళ్ళలో చర్చ పేరుతో వాదనకు దింపుతారు యాంకర్లు. వారిక్కూడా వాదులాటే ఇష్టం! దాన్ని చర్చ అనాలో రచ్చ అనాలో తేల్చుకోవాల్సింది ప్రేక్షకులే!
    సమాజాన్ని బాగుపరచడం కోసమే మేమున్నామని డబ్బా కొట్టుకునే తెలుగు టీవీ వార్తా ఛానళ్ళు-వారి పాలసీ ఏమిటో చెప్పరుగాక చెప్పరు. వైజ్ఞానిక విషయాల మీద ఒక శాస్త్రజ్ఞులను పిలిచి వివరాలు చెప్పిస్తారు. మళ్ళీ ఆ పక్కనే ఓ పూజారిని, ఓ జ్యోతిష్యుణ్ణి కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. అన్ని రకాల అభిప్రాయాలకు మేం వేదిక కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. అది సరే కానీ.. మీ ఛానల్‌, పాలసీ ఏమిటీ? 'చేటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టడమేనా?' క్షమించాలి! ఎవరినో తక్కువ చేయడానికి ఇక్కడ ఈ సామెత చెప్పలేదు. ఒక దృక్పథమంటూ లేని ఛానల్‌ నిర్వాహ కుల ఇంగిత జ్ఞానాన్ని ప్రశ్నించడం కోసమే చెప్పాను. వాస్తవ జగత్తులో అన్ని అభిప్రాయాలూ, ధోరణులూ ఉన్నాయి. కానీ, బాధ్యత గల వాళ్ళు ఏంచేయాలి? అవసరమైంది మాత్రమే జనానికి అందించాలి. వారి విజ్ఞత కనిపించేది అక్కడే. సమాజ ఉద్ధరణకు పని చేసే ఛానల్‌ ఏం చేయాలో వారికే తెలిసి ఉండాలి కదా?
     మత ప్రచారానికి టీవీ ఛానళ్ళు ఎంత బాగా పని చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఏ మతానికి సంబంధించిన ఛానళ్ళు ఆ మతానికి ఉన్నాయి. వాటి పనే అది. అవి కాకుండా మామూలు ఛానళ్ళలో కూడా సుప్రభాతాలు, జ్యోతిష్య వాణులు, ఆలయ దర్శనాలు వగైరా... ప్రార్థనా స్థలాల్లో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు.. ఖాళీ బుర్రల వారికి యమ గిరాకీ. ఆధ్యాత్మిక వేషాలతో కెమెరాల ముందు కూర్చుని 'స్పిరుచ్యువల్‌ ఎనర్జీ', 'పాజిటివ్‌ ఎనర్జీ'.. లాంటి మాటలు మార్చి మార్చి చెపుతుంటారు. ఉట్టి మాటలు కాదు, ఆ 'స్పిరుచ్యువల్‌ ఎనర్జీ'ని ప్రయోగాత్మకంగా చూపించాలి. అయినా అనాల్సింది వాళ్ళను కాదు, సదరు సరుకును తెచ్చి జనం మీద రుద్దుతున్న ఛానల్‌ యాజమాన్యాలను అనాలి.
     తెలుగు ప్రేక్షకులారా జాగ్రత్త!! మీకు ఇంగ్లీషు, హిందీ వంటి ఇతర భాషలు వచ్చినా ఇతర జాతీయ, అంతర్జాతీయ ఛానళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకండి. డిస్కవరీ సైన్స్‌, నేషనల్‌ జియోగ్రఫీ, సోని, బిబిసి ఎర్త్‌, యానిమల్‌ ప్లానెట్‌, హిస్టరీ టీవీ వంటి ఛానళ్ళలో మొహం పెట్టారో జాగ్రత్త! మీ మెదడు వాచిపోతుంది. అనవసరంగా ప్రకృతి రహస్యాలు, వైజ్ఞానిక విశేషాలు, ప్రపంచ జ్ఞానం అబ్బుతుంది. కనీసం ఆ ట్రావెల్‌ ఎక్స్‌పో, గుడ్‌ టైం...వైపు చూశారంటే వాళ్ళు మిమ్మల్ని దేశదేశాలు తిప్పిచూపెడతారు. ఏ దేశం ఎలా ఉంది? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చెపుతారు. దానివల్ల అనవసరంగా మీకు జనరల్‌ నాలెడ్జ్‌ పెరిగే అవకాశముంది. మరి మీ ఇష్టం! బిబిసి వరల్డ్‌, సి.ఎన్‌.ఎన్‌, అల్‌జజీర, ఫ్రాన్స్‌, రష్యా టీవీ లాంటివి చూస్తే ప్రపంచ వార్తలతో మీ మొహం వాచిపోతుంది. అవన్నీ మనకు అవసరమా? తెలుగు ఛానళ్ళకే పరిమితమైపోతే మంచిది. ఎంత అజ్ఞానంలో ఉంటే, ఎంత మూఢత్వంలో ఉంటే బతకు అంత సుఖంగా ఉంటుందని ఓ 'టీవీ బాబా'నే చెప్పాడు.
     ఈ ఛానళ్ళకు ప్రజలు పట్టరు. జీవితపు విలువలు నిలబెట్టాలని ఉండదు. అన్ని రకాలుగా చచ్చిపోతున్న మనిషిని ఎలా బతికించుకుందామన్న ధ్యాస ఉండదు! వ్యాపార ప్రకటనలతో డబ్బు సంపాదించుకుంటూ, రేటింగ్‌ పెంచుకోవాలి. అంతే! ఒకవైపు రాజకీయ నాయకులు. మరోవైపు ఛానళ్ళూ నరుక్కుంటూ వస్తుంటాయి. తప్పించుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేక బలి అయ్యేది సగటు ప్రేక్షకులే. మనిషికి మెదడు చాలా ముఖ్యమైంది. దాన్ని సరైన దారిలో పెట్టి, మానవ జీవితాన్ని వివేకవంతం చేసుకుందామన్న ఆలోచన ఎవరికీ ఉండటం లేదు.
 

/ వ్యాసకర్త సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త /
డా|| దేవరాజు మహారాజు

డా|| దేవరాజు మహారాజు