Aug 30,2023 00:27

ప్రసంగిస్తున్న న్యాయమూర్తి ఎంవి శేషమ్మ

ప్రజాశక్తి-విశాఖ లీగల్‌ : మారుతున్న చట్టాలకు అనుగుణంగా న్యాయవాదులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విశాఖ జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషమ్మ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదంలో లోక్‌ అదాలత్‌ ఆధ్వర్యాన న్యాయ సహాయకుల, ఉచిత న్యాయ సహాయం అందించే న్యాయవాదులకు మంగళవారం ఒకరోజు శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవి.శేషమ్మ మాట్లాడుతూ, జాతీయస్థాయిలో పేద, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, ఇతర వెనుకబడిన తరగతుల ప్రజలకు అందిస్తున్న న్యాయ సేవలను అందరూ వివరించాలన్నారు. సమాజంలో సామాన్య పౌరులకు సైతం న్యాయ ఫలాలను అందించే న్యాయవాదులు తమ సేవలను అన్ని వర్గాలకు అందించాలన్నారు. సేవా ప్రాధికార సంస్థ అందిస్తున్న సేవలను, అదాలత్‌ చట్టాలను వివరించారు. న్యాయ సేవా సంస్థ జాతీయ శిక్షకుడు, సీనియర్‌ న్యాయవాది రఘుపాత్రుని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఏ వ్యక్తీ న్యాయ ఫలాలకు దూరం కాకూడదన్న జస్టిస్‌ కృష్ణఅయ్యర్‌ చెప్పిన అంశాలను గుర్తు చేశారు. న్యాయవాదులందరూ సమాజానికి నిజమైన సేవకులుగా ప్రస్తుతించారు. ఇటీవల న్యాయ సేవ సంస్థ, సమాంతర న్యాయవాదులు, శాశ్వత న్యాయవాదులు అందిస్తున్న సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.