Oct 25,2023 21:14

రహదారి నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో రోడ్డు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. మండలంలోని గిరిశిఖర గ్రామమైన నోండ్రుకోన పంచాయతీ కీసర గ్రామం నుండి కీసరగూడ వరకు రూ1.30 కోట్లతో 1.3 కిలోమీటర్లు బిటి రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండల మీద గిరిజన గ్రామాలకు రోడ్లు వేసి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఈ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు తెలిపారు. అనంతరం కేదారిపురంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రతి పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె.దీనమయ్య, జెడ్‌పిటిసి రాధిక, రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి.గిరిబాబు, వైస్‌ ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, సచివాలయ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.