ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే
ప్రజాశక్తి -రంపచోడవరం
మారుమూల గ్రామాలకు రహదారులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే పేర్కొన్నారు. శుక్రవారం వై.రామవరం మండలం కానివాడ రహదారి ఏర్పాటు చేయడానికి ప్రాజెక్ట్ అధికారి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై.రామవరం మండలం ఎగువ ప్రాంతమైన కానీవాడ పంచాయతీలో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని, రోడ్డు ఏర్పాటు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ పల్లాల శిల్పారాణి తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదన తయారు చేసి సమర్పించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆశ్రమ పాఠశాల సందర్శన
అనంతరం మారేడుమిల్లి మండలం బంద ఆశ్రమ పాఠశాలను ఆయన పరిశీలించి ఆ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నదీ, ప్రతిరోజు ఏయే ఆహారం పెడుతున్నదీ, సరుకులు సకాలంలో వస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. స్టోర్‌ను పరిశీలించారు. కాంట్రాక్టరు తాజా కూరగాయలు తీసుకువచ్చే విధంగా ఎప్పటికప్పుడు సంప్రదించాలని వార్డెన్‌కు సూచించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవితేజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










