Oct 10,2023 19:44

విద్యార్థిని శివలింగమ్మను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
కర్ణాటక సరిహద్దు మారుమూల గ్రామ విద్యార్థిని శివలింగమ్మ ప్రభుత్వ ప్రోత్సాహంతో అమెరికా వెళ్లి రావడం గొప్ప విషయమని ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిజెపి రాష్ట్ర నాయకులు విట్టా రమేష్‌ తెలిపారు. కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన సోమనాథ్‌, గంగమ్మల చిన్న కుమార్తె శివలింగమ్మ ఇటీవల అమెరికా వెళ్లొచ్చి ముఖ్యమంత్రి చేత ప్రశంసలు అందుకున్నారు. మంగళవారం స్థానిక భీమాస్‌ హాలులో ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. విట్టా రమేష్‌ ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడారు. అమెరికా వెళ్లాలంటే కోటేశ్వర్లు అయి ఉండాలనేది గతంలో మాట అని, ప్రస్తుతం ప్రతిభ ఉంటే చాలని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అనేక స్కిల్స్‌ ఉన్నాయని, ప్రదర్శించుకోవడానికి సరైనా వేదిక లేక శివలింగమ్మ లాంటి ప్రతిభ కలిగిన అనేక మంది పేద విద్యార్థులు మెరుగైన అవకాశాలకు నోచుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన అవకాశాలను మరెందరో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు అందిపుచ్చుకోని చదువులో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం శాలువా, పూలమాల వేసి శివలింగమ్మ, తండ్రి సోమనాథ్‌ను విట్టా రమేష్‌ సన్మానించారు. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు బసవరాజ్‌ మాట్లాడుతూ... పేద విద్యార్థుల కోసం విదేశీ విద్య దీవెన పేరుతో ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలిపారు. తమ అన్న కుమార్తె ఇలాంటి అరుదైన అవకాశం అందిపుచ్చుకొని సొంత ఊరికి, జిల్లాకే కాకుండా తమ కుటుంబానికి గౌరవం తీసుకొచ్చిందని కొనియాడారు. అనంతరం డివిజన్‌ కార్యదర్శి మునెప్ప, ట్రెజరరీ సుధాకర్‌, మల్లికార్జున, సభ్యులు రమేష్‌ రెడ్డి, ప్రజాశక్తి జిల్లా ఇన్‌ఛార్జీ రాజులు శాలువా, పూలమాల వేసి శివలింగమ్మను సన్మానించారు. మున్సిపల్‌ ట్రాక్టర్‌ డ్రైవర్స్‌ ఉసేని, మౌలాలి, గోవర్ధన్‌, బసవరాజు, హరి కేక్‌ కట్‌ చేసి, శాలువా, పూలమాలతో శివలింగమ్మకు అభినందనలు తెలిపారు. రంజాన్‌, భగవాన్‌ స్వామి, నౌనేపాటి, మేనేజర్‌ నాగరాజు పాల్గొన్నారు.