Mar 01,2023 23:27

ఘటనా స్థలం వద్ద పడిఉన్న సామగ్రి

ప్రజాశక్తి -మార్టూరు రూరల్‌ : ప్రపంచం ఆధునిక పరిజ్ఞానం వైపు పరుగులు పెడుతుంటే కుటుంబాలపై వ్యక్తిగత కక్షలు పెంచుకుని మూఢ నమ్మకాలతో కొంతమంది క్షుద్రపూజలు నిర్వహించారు. ఈ ఘటన స్థానిక శ్రీ చైతన్యస్కూల్‌కు వెనుక వైపున ఉన్న రామ్‌ నగర్‌కాలనీ వద్ద బుధవారం వెలుగుచూసింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన మార్టూరులో కలకలం రేపింది.ఘటనా స్థలం వద్ద చిన్నారి దుస్తులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు ఇతర సామగ్రి లభ్యమయ్యాయి. దంపతులు, చిన్నారి ఉన్న పొటోపై కుంకుమ, నిమ్మకాయలు పెట్టి, పక్కన బాలికలకు సరిపడే రెడీమేడ్‌ దుస్తులు ఉంచి పూజలు నిర్వహించిన ఆనవాళ్లు ఘటనా స్థలంలో కనిపించాయి. ఫొటో వెనుక 08260070044 ఫోన్‌ నంబర్‌ రాసి ఉంది. ఆ నంబర్‌ కి ఫోన్‌ చేసి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయగా సదరు వ్యక్తి తమది ఒడిస్సా రాష్ట్రామని హిందీలో మాట్లాడి రాంగ్‌నంబర్‌ అంటూ పెట్టేయడం విశేషం.. ఫొటోను పరిశీలించిన స్థానికులు ఆఫొటో లోని వ్యక్తులు తమ ప్రాంతానికి చెందిన వారు కాదని చెబుతున్నారు. గత కొద్దీ కాలంగా మార్టూరు పట్టణానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఇలాంటి క్షుద్రపూజల పేరుతో అమాయకులను దోచుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ కార్పొరేట్‌ సంస్థకు చెందిన పాఠశాలకు అతి సమీపంలో జనావాసాల మధ్య క్షుద్ర పూజలు నిర్వహించడం పట్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవు తున్నారు. పోలీసులు స్పందించి క్షుద్రపూజలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.