ప్రజాశక్తి-సీతమ్మధార : రాజధాని కానున్న విశాఖలో స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని సినీ నటుడు సుమన్ అన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ సిఎం కప్ కరాటే పోటీలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో సుమన్ మాట్లాడుతూ, ఈ కరాటే పోటీల్లో పాల్గొనేందుకు జర్మనీ, స్విట్జర్లాండ్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ తదితర 9 దేశాల నుంచి కరాటే క్రీడాకారులు హాజరయ్యారన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. కరాటే క్రీడ ఆత్మరక్షణకు ఆలంబనగా నిలుస్తున్నందున బాలబాలికలందరూ నేర్చుకోవాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కరాటే పోటీలను విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యుల్ని అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దాడి సత్యనారాయణ, కమిటీ ప్రతినిధులు, క్రీడాకారులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.










