Sep 22,2023 21:36

ప్రజాశక్తి - భీమవరం
           జిల్లాలో పోలింగ్‌ స్టేషన్ల మార్పులు, చేర్పుల ప్రక్రియను అత్యంత పారదర్శకతతో చేపట్టామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పోలింగ్‌స్టేషన్ల రేషనలైజేషన్‌ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌తో పాటు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఆరు కొత్త పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 1,460 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని, వాటిలో 43 పోలింగ్‌ స్టేషన్ల లోకేషన్‌ మార్పు కోసం, 207 పోలింగ్‌ స్టేషన్ల పేరు మార్పు కోసం ఎలక్షన్‌ కమిషన్‌కు పంపించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎలక్షన్‌ డిప్యూటీ తహశీల్దార్‌ ఎం.సన్యాసిరావు, వివిధ పార్టీల ప్రతినిధులు కోమటి రాంబాబు, కోమటి రవికుమార్‌, శ్యాంబాబు, జెఎన్‌వి.గోపాలన్‌, టి.వంశీ, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.