Nov 07,2023 23:32

అరుణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సీనియర్‌ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
మార్క్సిజం లెనినిజం అజేయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. అక్టోబర్‌ విప్లవ దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని శ్యామల సెంటర్లో సిపిఎం కార్యాలయం వద్ద మంగళవారం అరుణ పతాకావిష్కరణ జరిగింది. సిపిఎం సీనియర్‌ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభను ఉద్దేశించి మంతెన సీతారాం మాట్లాడారు. దేశ సంపదను లూటీ చేస్తూ కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వ విధానాల ఫలితంగా దేశంలో అసమానతలు మరింత పెరుగుతున్నాయన్నారు. కార్పొరేటీకరణ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకతను వివరించారు. అక్టోబర్‌ విప్లవ దినోత్సవ స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న పాలకులను నిలదీసేందుకు ప్రజా పోరాటాలు మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. అక్టోబర్‌ విప్లవం స్ఫూర్తితో ప్రపంచంలో అనేక దేశాల్లో స్వాతంత్య్ర ఉద్యమాలకు ప్రేరణ పొందయని, స్వాతంత్య్రాలు సాధించాయన్నారు. ఈ విప్లవం తరువాతే ప్రపంచంలో పెట్టుబడిదారీ ప్రభుత్వాలు సైతం సంక్షేమ ప్రభుత్వాలుగా మారాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం, ఎవి.నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, రాష్ట్ర నాయకులు హరిబాబు, కె.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, నగర కార్యదర్శి బి.పవన్‌, జిల్లా కమిటీ సభ్యులు బి.రాజులోవ, తులసి, ఎస్‌ఎస్‌.మూర్తి, నాయకులు ఐ.సుబ్రహ్మణ్యం, కె.అన్నామణి, ఎం.వెంకటలక్ష్మి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.