ప్రజాశక్తి - ఏలూరు
కారల్‌మార్క్స్ చూపిన బాటలో సమాజ మార్పు కోసం అంతా కృషి చేయాలని ఎంఎల్‌సి షేక్ సాబ్జీ పిలుపునిచ్చారు. మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ 140వ వర్థంతి సందర్భంగా స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం, సిఐటియు, యుటిఎఫ్ ఆధ్వర్యాన మంగళవారం సాయంత్రం చర్చాగోష్టి నిర్వహించారు. దీనికి పి.ఆదిశేషు స్వాగతం పలికారు. గుడిపాటి నరసింహారావు అధ్యక్షతన సాగిన చర్చాగోష్టిలో కారల్ మార్క్స్ చిత్రపటానికి ఎంఎల్‌సి షేక్ సాబ్జీ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యక్షత వహించిన గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ మార్క్స్ జీవితం, ఆయన సిద్ధాంతం ఉత్తేజభరితం, మార్గదర్శకం అని అన్నారు. ముఖ్యఅతిథి షేక్ సాబ్జీ మాట్లాడుతూ మార్క్సిజం, మార్క్స్ జీవితం గురించి నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో చర్చ సాగుతోందన్నారు. మార్క్స్ చూపిన విధంగా మన దేశంలో మార్పు కోసం కృషి చేయడం ద్వారా దేశాన్ని బాగు చేసుకోవచ్చన్నారు. నేటి పాలకులు అన్ని రూపాల్లో ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ మార్క్స్ జీవితం గురించి చర్చించుకోవడం అంటే అది ఆయన సిద్ధాంతం గురించి, దాని అమలుకు మనం చేయాల్సిన కృషి గురించి చర్చించుకోవడం అని అన్నారు. చర్చలో వై.ఆనందనాయుడు, శ్రీహరి కోటి, మేతర అజరుబాబు, ఆర్.లింగరాజు, బి.సోమయ్య, పి.ఆదిశేషు, మిల్టన్, కె.శ్రీనివాస్, కె.విజయలక్ష్మి, విజిఎంవిఆర్.కృష్ణారావు, సిహెచ్.సుందరయ్య, ఆర్.నరసింహమూర్తి, కె.లెనిన్‌బాబు, జి.కోటేశ్వరరావు, గోపీ, జి.రవీంద్ర పాల్గొన్నారు. హాజరైన అందరికీ కమ్యూనిస్టు ప్రణాళిక, కారల్ మార్క్స్ జీవితంపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీహరి కోటి, పి.ఆదిశేషు పాడిన పాటలు, మార్క్స్ జీవితంపై ప్రదర్శించిన వీడియోలు ఆకట్టుకున్నాయి.
ప్రపంచంలో అనేకమంది తత్వవేత్తలు సమాజాన్ని పరిపరివిధాలుగా విశ్లేషించారే గానీ మారే సమాజాన్ని తెలియచెప్పింది కార్ల్‌మార్క్స్ మాత్రమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. మార్క్స్ వర్థంతి సందర్భంగా మంగళవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో మార్క్స్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవి మాట్లాడుతూ మార్క్స్ అనేక గ్రంథాలు చదవడమే కాకుండా ప్రపంచ పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేశారన్నారు. దాని నుండి ఆయన ఈ సమాజం వర్గ పోరాటాల ద్వారా మార్పులు చెందుతూ వచ్చిందన్నారు. పెట్టుబడిదారీ విధానం దోపిడీ చేస్తుందని, ఈ దోపిడీ వల్ల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతాయని తెలిపారు. ఆర్థిక అసమానతలు తొలగిపోతేనే ప్రజలను పట్టిపీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, కుల వివక్ష వంటి రుగ్మతలు తొలగిపోతాయన్నారు. పెట్టుబడిదారీ సమాజం అభివృద్ధి అయిన తరువాత జరిగే వర్గ పోరాటాల నుండే సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్థలు ఏర్పడుతాయని మార్క్స్ తెలిపారన్నారు. మార్క్స్ అందించిన సిద్ధాంత స్ఫూర్తితో కమ్యూనిస్టు శ్రేణులు ఆ పనిలో కంకణబద్దులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుడిపాటి నరసింహారావు, బి.సోమయ్య, కె.శ్రీనివాస్, పివి.రామకృష్ణ, ఎ.శ్యామలారాణి, నగర నాయకులు జి.గోపి, మంచెల్ల ఇస్సాకు, ఎస్.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, గౌడ రవీంద్ర, గనిగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం:దోపిడీదారులను ఎదిరించినప్పుడే కార్మిక వర్గానికి నిజమైన విముక్తి కలుగుతుందని సిపిఎం మండల కార్యదర్శి మానుకొండ జీవరత్నం అన్నారు. మార్క్స్ వర్థంతి సభ స్థానిక సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. మండల కమిటీ సభ్యులు జి.సూర్యకిరణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ పి.సూర్యారావు, నాయకులు నాయుడు వెంకన్న, బొబ్బిలి గంగరాజు, బి.నాని, టి.యశ్వంత్, పి.మణికుమార్, డి.ఆశీర్వాదం, బాలరాజు, కె.రాజు, ఎ.స్టాలిన్ పాల్గొన్నారు.
నిడమర్రు : మార్క్స్ వర్థంతి సభ భువనపల్లిలో సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ ప్రపంచగతినే మార్చిన మార్క్స్ త్యాగధన్యుడని, నేటి ప్రపంచ పరిణామాలను ఆయన ముందుగానే అధ్యయనం చేశారని, కార్మికవర్గానికి దిశా నిర్దేశం చూపిన మహావ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర సత్యనారాయణ, కోన శ్రీనివాసరావు, వెలగలేటి మోహన్, లింగబరి లక్ష్మణరావు, ప్రగడ మణికంఠ, వలపు సత్తిబాబు, గిరిబాబు పాల్గొన్నారు.










