
మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయాలి
- ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.రమేష్ కుమార్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించి కొనుగోళ్లు చేయాలని ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి. రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నంద్యాలలోని టి.నరసింహయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నంద్యాల జిల్లాలో 1 లక్షా 35 వేల 710 ఎకరాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగం మొక్కజొన్న పంట సాగు చేశారని తెలిపారు. పంట వేసినప్పుడు మొలక దశలో వర్షాలు ఎక్కువై, కంకి దశలో వర్షాలు లేక కేవలం ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని చెప్పారు. అరకొర వచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే ప్రైవేటు వ్యాపారస్తులు క్వింటా 1,800 రూపాయల నుండి 1,900 రూపాయలు మాత్రమే అడుగుతున్నారని చెప్పారు. డబ్బులు కూడా 7 నుండి 10 రోజుల వరకు చెల్లించని పరిస్థితి ఉండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ఒక ఎకరా భూమి సాగుకు 40 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టారని, ప్రస్తుతం అరకొర వచ్చిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు కావడం లేదని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర మాత్రం క్వింటా 2,090 రూపాయల వరకు ఉంటే మధ్య దళారులు తక్కువ ధరకే కొని రైతాంగాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. మద్దతు ధరల చట్టాలు చేయడం తప్ప వాటిని అమలు చేయడం చేతగాని ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మొక్కజొన్నలు పండించిన రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. విత్తనం దగ్గర నుండి పంట అమ్ముకునే వరకు రైతుకు అండగా ఉంటామని రైతు భరోసా గురించి గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఈ ఒక్క రైతు భరోసా కేంద్రంలో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని చెప్పారు. ఎన్నికల కోసం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో రైతుల కోసం చేసిన చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయని విమర్శించారు. కేవలం ప్రైవేట్ వ్యాపారస్తులు ఇచ్చే కాసులకు ఆశపడి సకాలంలో రైతుల వద్ద మొక్కజొన్నలు ఉన్నప్పుడు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. రైతుల నుండి పూర్తిగా ప్రైవేటు వ్యాపారస్తులు కొన్న తర్వాత మద్దతు ధరలు అమలు చేసి ప్రైవేట్ వ్యాపారస్తుల బొజ్జలు నింపడం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా జిల్లాలోని రైతులు పండించిన మొక్కజొన్నలన్నింటినీ మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో జిల్లాలో రైతాంగాన్ని సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులకు మద్దతు ధరలతో పాటు, రవాణా చార్జీలు, హమాలీ ఖర్చులు కూడా ప్రభుత్వాలే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్, రైతు సంఘం నాయకులు ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.