ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నగరంలోని మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా చేపట్టాలని కమిషనర్ డాక్టర్ జె.అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కమిషనర్ ఎన్టీఆర్ బస్టాండ్‌లోని కూరగాయల మార్కెట్, పాత కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయల మార్కెట్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. మార్కెట్లలో జనం తిరిగే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ పలువురు దుకాణదారులతో స్వయంగా మాట్లాడారు. వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని, దుకాణాల వద్ద డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసుకొని అందులో వేయాలన్నారు. వీటిని పారిశుద్ధ్య కార్మికులకు అందివ్వాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దని అవగాహన కల్పించారు. కమర్షియల్ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం అంశాలపై దుకాణదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ చేపల మార్కెట్లోని దుకాణాలను తనిఖీ చేశారు. నాణ్యమైన చేపలనే వినియోగదారులకు విక్రయించాలన్నారు. చేపలను విక్రయించే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చేపల మార్కెట్ వద్ద రోజూ శుభ్రం చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ, లోకనాథం, పర్యావరణ పారిశుధ్య కార్యదర్శులు, మేస్త్రిలు పాల్గొన్నారు.