ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాలో నకిలీ పత్తివిత్తనాలు రంగప్రవేశం చేశాయి. నిషేధిత బిజి-3 విత్తనాలను విక్రయాలను రహస్యంగా ప్రారంభించారు. ఈ విత్తనాల సాగును ప్రభుత్వం నిషేధించినా గతకొంత కాలంగా విక్రయాలు, అధికారులు దాడులు చేసి పట్టుకోవడాలు పరిపాటైంది. గతంలో కొంతమంది విక్రయదారుల లైసెన్సులను రద్దు చేసినా రాజకీయ వత్తిడితో పునరుద్ధరించారు. గుజరాత్, కర్ణాటక, తెలంగాణ నుంచి బిజి-3 విత్తనాలు గుంటూరు, పల్నాడు జిల్లాకు వచ్చినట్టు చెబుతున్నారు. వీటిని కొన్ని కంపెనీలు రైతులకు అనుమానం రాకుండా బిజి-2 రకం పత్తి విత్తనాల్లో కలిపి విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏటా రూ.50 కోట్ల వరకు విత్తనాలు విక్రయిస్తారని అంచనా. వ్యవసాయ, విజిలెన్సు అధికారులు అడపాదడపా దాడులు నిర్వహించినా వీటి మూలాలను మాత్రం నియంత్రించలేకపోతున్నారు. గుజరాత్‌తో పాటు కొంత భాగం కర్ణాటక నుంచి కూడా ఎక్కువగా బిజి-3 విత్తనాలు వస్తున్నట్టు తెలిసింది. గతంలో వ్యాపారులు, తయారీ, రవాణా దారులపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే పెద్ద ఎత్తున జిల్లాకు దిగుమతి అయ్యాయి. లేబుల్స్ లేకుండా గన్నీ బ్యాగ్స్‌తో కొంతమంది రవాణ చేస్తున్నారు. మరికొంత మంది కొత్త లేబుల్స్‌తో పలు కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలను తెస్తున్నారు. తక్కువ ధరలకు మంచి ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలంటూ రైతులను నమ్మిస్తున్నారు. వీటిని విక్రయించడం వల్ల కూడా వ్యాపారులకు, దళారులకు మంచి లాభాలు ఆర్జించే అవకాశం కల్పిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు. అయితే రైతులే స్వయంగా విత్తనాలను తయారు చేసుకునే అవకాశం ఉన్నా వ్యవసాయ శాఖ ఆ దిశగా రైతులను చైతన్యవంతం చేయలేకపోతోంది. అధిక దిగుబడి వస్తుందని, నాణ్యత కల్గిన విత్తనాలు విక్రయిస్తామని చెబుతూ రకరకాల లేబుల్స్‌తో విత్తనాల విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా నకిలీ పత్తి విత్తనాలు జిల్లాకు వస్తున్నట్టు చెబుతున్నారు. బిజి-3 విత్తనాల సాగు వల్ల భూసారం దెబ్బతింటుందని, వరుసగా నాలుగేళ్ల పాటు ఈ విత్తనాలను సాగు చేయడం వల్ల భవిష్యత్తులో పంటలు సాగుచేయలేని పరిస్థితి ఏర్పడుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు నిర్లిప్తత వల్లే బిజి-3 విత్తనాల విక్రయం, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో నిషేధిత విత్తనాలు జిల్లాలను ముంచెత్తడంపై రైతుల్లో ఏదీ అసలు...ఏది నకిలీనో తెలియని పరిస్థితిలో ఉండిపోతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా ఏదో ప్రాంతంలో నకిలీ విత్తనాలు వచ్చి రైతులు నష్టపోతూనే ఉన్నారు.










