ప్రజాశక్తి-పర్చూరు: గత సంవత్సరం మిర్చిపై గిట్టుబాటు ధర ఉండటంతో ఈ ఏడాది మిర్చి పంట సాగు చేసేందుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపారు. పర్చూరు వ్యవసాయ డివిజన్‌లో ఈ ఏడాది సుమారు 20 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. పంట సాగు మొదట్లోనే ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. ముందు వర్షాభావ పరిస్థితులు కొనసాగాయి. అనంతరం అధిక వర్షాలకు పైర్లు దెబ్బతిన్నాయి. కొన్ని వందల ఎకరాల్లో మొక్కలు ఉరకెత్తాయి. అలాంటి పంట చేలల్లో రైతులు కొన్ని కష్టనష్టాలకు ఓర్చి మళ్లీ మిర్చి సాగు చేశారు. దీనివల్ల ఖర్చు విపరీతంగా పెరిగింది. చీడపీడల బెడద లేదనుకుంటున్న సమయంలో నల్లి తెగులు బారిన పడింది. దీనికి తోడు రసం పీల్చే పురుగుల దాడి ఎక్కువైంది. డిశంబరు 15 నుంచి తీవ్ర మంచు ప్రభావంతో కొంతమేర పూతరాలింది. ప్రస్తుతం ముదురు చేలల్లో కోతలు కోస్తున్నారు. దిగుబడులు అంతంతమాత్రంగా ఉన్నాయి. ప్రస్తుతం మిర్చి కోతలు ప్రారంభం కాగా కూలీల కొరత వెంటాడుతోంది. సాగు తొలి రోజుల్లోనే పురుగు మందులు, కలుపుతీతకు రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఖర్చులు అధికమయ్యాయి. కొంతమేర కూలీల కొరత లేకుండా సాగింది. మిర్చి కోతలు కీలక దశ. అదునులో కాయలకోత జరగాలి. ఉపాధి హామీ పనులు జరుగుతుండటంతో కూలీల కొరత ఉందని రైతులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూలీలకు రూ.350తో పాటు రవాణా ఖర్చులు కూడా ఇవ్వాల్సి వస్తుందని మొత్తం రూ.400 వరకు ఒక్కో కూలికి ఖర్చవుతుందన్నారు. అయినప్పటికీ కూలీల కొరత వేధిస్తూనే ఉంది. దీంతో ఎక్కువ మంది రైతులు ఇతర ప్రాంతాల నుంచి ముఠాలను తెచ్చుకుంటున్నారు. వారికి ఉండేందుకు ఆవాసం ఏర్పాటు చేయటం కష్టతరంగా ఉందని చెబుతున్నారు. మిర్చి గత సంవత్సరం ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధర కూడా ఆశించినంతగా ఉంది. ప్రస్తుతం కోతల తీరు చూస్తుంటే ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి నెలకొంది. గత ఏడాది తేజ, 5531 తదితర రకాలకు క్వింటాకు రూ.25 వేల వరకు ధర పలికింది. నాటు రకానికి కూడా మంచి రేటు పలికింది. ఇక బేడిగ రకానికి వీటన్నింటికన్నా అదనంగా రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు లభించింది. ప్రస్తుతం తేజ, 5531 రకానికి క్వింటా రూ.16,500 నుంచి రూ.18,000 వరకు మాత్రమే ధర ఉంది. బేడిగ గత సంవత్సరంతో పోలిస్తే క్వింటాకు రూ.10 వేల తక్కువ ధర పలుకుతోంది. క్వింటా రూ.25 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని రైతుసంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు బండి శంకరయ్య కోరుతున్నారు. గుంటూరు యార్డు మిర్చి యార్డు అమ్మకాలకు పెట్టింది పేరు అని, రకాన్ని బట్టి రూ.25 వేలకు తగ్గకుండా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శంకరయ్య డిమాండ్ చేశారు. లేకుంటే ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రైవేటు వ్యాపారులు ధరలను తగ్గిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి మద్దతు ధర వచ్చేలా చూడాలని ఆయన కోరారు.










