కళకళలాడుతున్న ఏలూరులోని రైతు బజారు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
కూరగాయల రైతుల పంట పండింది. ఇదేంటి కొంతకాలంగా అయితే అతివృష్టి.. లేకుంటే అనావృష్టితో ఇబ్బందులు పడే కూరగాయల రైతుల పంట పండడం ఏంటనుకుంటున్నారా? అదేనండి కార్తీక మాసం. వనభోజనాలు.. అయ్యప్ప దీక్షలు వంటి కార్యాలు ప్రారంభం కావడంతో కూరగాయల వ్యాపారం జోరందుకుంది. దానికి తగినట్లుగానే ధరలు కూడా గతం కంటే హెచ్చుతగ్గులతో రైతులకు కాస్త లాభసాటిగా మారింది. కార్తీకమాసం ఆరంభం కావడంతో అధికశాతం మంది ఈ నెలలో మాంసాహారాల జోలికి వెళ్లరు. దీంతో శాకాహార వంటలకు అవసరమైన కూరగాయ ధరలు ఈ నెలలో ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. అయితే ఈ ఏడాది మూడుసార్లు వరదలు రావడం, అవి తగ్గినా అధిక వర్షాలు వెంటాడటంతో స్థానికంగా కూరగాయలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే కొద్దిరోజులుగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దిగుబడులు కాస్త పెరిగాయి. దానికితోడుగా కార్తీకమాసం రావడం వారికి కలిసి వచ్చింది.
వంగ, బెండ, బీరతో పాటుగా ఇతర కూరగాయలు వంటివన్నీ మెట్ట ప్రాంతాలైన కొయ్యలగూడెం, టి.నరసాపురం ప్రాంతాలతో పాటుగా నగరానికి సమీపంలో ఉన్న చొదిమెళ్ల, పెదవేగి, కృష్ణాజిల్లా నుంచి పెద్ద మొత్తంలో ఏలూరులోని ఎన్‌ఎస్ మార్కెట్‌కు, రైతు బజార్లకు వస్తున్నాయి. ఈ కూరగాయల ధరల్లో చిక్కుడుదేపై చేయిగా చెప్పుకోవచ్చు. ఇవి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా వస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చే చిక్కుడు కాయలు రకాన్ని బట్టి పది కేజీలు రూ.500 నుంచి రూ.700 వరకూ పలుకుతున్నాయి. కూరగాయల్లో అధికంగా వినియోగించే టమోట వినియోగదారులకు ఎంతో అందుబాటులో ఉందని చెప్పొచ్చు. చిత్తూరు జిల్లా మదనపల్లి, ఎన్‌టిఆర్ జిల్లా నుంచి వస్తున్న ఈ టమోటా 25 కేజీల బాక్స్ రూ.250 నుంచి రూ.350 పలుకుతుంది. అలాగే వర్షాలు అధికంగా ఉండడం వల్ల కొత్తిమీర ధర అధికంగానే ఉంది. దీనికి బెంగుళూరు ప్రాంతం నుంచి కొత్తిమీరను దిగుమతి చేసుకోవడమేనని వ్యాపారులు చెబుతున్నారు. మరో పది పదిహేను రోజుల వరకూ కొత్తిమీర స్థానికంగా అందుబాటులోకి రాదని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు కొత్తిమీర కేజీ రూ.60 నుంచి రూ.80 వరకూ అమ్ముతున్నారు. అలాగే వంగ పది కేజీలు రైతు ధర రూ.500 నుంచి రూ.600, బీర రూ.250 నుంచి రూ.300, దొండ రూ.250 నుంచి రూ.300, మిర్చి రూ.300 నుంచి రూ.350, ఆనప కాయ ఒక్కటి పది నుంచి పదిహేను రూపాయలు పలుకుతుంది. మొత్తానికి ఈ కార్తీకమాసం కూరగాయల బజార్లు కిటకిటలాడుతుండటంతో రైతులకు కాస్త ఊరట లభిస్తుందని చెప్పొచ్చు.










