May 08,2022 13:26

కొత్తగా రాయాలని
ట్రై చేస్తున్న
కుదరడం లేదు
సముద్రంలో
అలలని చూసినా
ఆకాశంలో పరిగెత్తే
మబ్బుల్ని చూసినా
ఎటు చూసినా ఇదేమి
పరుగనిపిస్తోంది...

అక్షరాలను పైకి కిందకి
మారుస్తూ అటు ఇటు
కుళ్ళబొడుస్తూ
ముందుకు వెనక్కి
తోసేస్తుంటే
ఇక్కడ కూడా
పోటీయేనా
అనిపిస్తోంది...

కొత్తగా రాయాలి
అనుకుంటున్నా
కానీ కుదరడం లేదు
టెక్నాలజీ మెడ మీదెక్కి
డాన్స్‌ చేస్తుంటే...
తలకు అమతాంజనం
రాసుకోవడం తప్ప
వేరే మార్గం కనిపించట్లేదు..

కొత్తగా రాస్తున్నాం
కొత్తగా ట్రై చేస్తున్నాం
అనుకుంటాం కానీ
అవే భావాలు,
అవే తిట్లు, అవే తుమ్ములు,
అవే గొడ్డళ్లు, అవే కత్తులు
ఇదే కొత్తదనం అని
అర్థమయ్యింది...

కొత్తదనం అంటే ఏమిటి
అక్షరాల్లో కొత్త,
అల్లికలో కొత్త,
ఆత్మవిమర్శలో కొత్త
అభిప్రాయంలో కొత్త...

మన పిచ్చి కానీ
ఇప్పుడేదీ కొత్త కాదు
ఏదీ పాతా కాదు...
చదివించే లక్షణం
ఉన్నప్పుడు...
కన్నీళ్లు పెట్టించగలిగే
భావం ఉన్నప్పుడు...
వెన్నులో వేయి ఏనుగుల
బలాన్నిచ్చే ధైర్యం
ఉన్నప్పుడే అది
కొత్తదనం అవుతుంది...
అదే కొత్త కవితౌతుంది
 

అమూల్యచందు