Jul 16,2023 19:06

డిసిఎంఎస్‌ చైర్‌పర్సన్‌ అవనాపు భావన

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : వివిధ రంగాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంతోపాటు తద్వారా ఉత్పత్తి చేసిన వస్తు సామగ్రిని సరసమైన ధరలకు ప్రజలు, సంస్థలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా డిసిఎంస్‌ పనిచేస్తోందని డిసిఎంస్‌ (జిల్లా కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ) చైర్‌పర్సన్‌ అవనాపు భావన అన్నారు. గతంలో డిసిఎంస్‌లను పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల ప్రస్తుతం పరిమితమైన సేవలు అందిస్తున్నామని, దీన్ని అధిగమించేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతోపాటు ఆధునిక యాజమాన్య పద్ధతులపై అవగాహనా సదస్సులు కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. ఇటు ప్రభుత్వ స్కూళ్లకు అవసరమయ్యే డిజిటల్‌ క్లాస్‌ రూం మెటీరియల్స్‌ కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ వారం తనను కలిసిన ప్రజాశక్తికి ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే....
ప్రస్తుతం డిసిఎంఎస్‌ పరిస్థితి ఎలా ఉంది?
కార్యకలాపాల నిర్వహణలో విజయనగరం డిసిఎంస్‌ 5వ స్థానంలో ఉంది. సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రాష్ట్రంలో రూ.20కోట్లకుపైగా టర్నోవర్‌ చేస్తున్న వాటిలో విజయనగరం డిసిఎంఎస్‌ ఒకటి. స్థిరాస్తులు, ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా డిసిఎంస్‌ను మరింత అభివృద్ధిచేసి, ప్రజలకు అన్ని విధాలా సహకారం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాలో విజయనగరం, బొబ్బిలిలో రెండు డిసిఎంస్‌ బ్రాంచిలు ఉన్నాయి. వీటి ద్వారా ఉత్పత్తుల కొనుగోలు, తద్వారా కొన్ని ఉత్పత్తులను తయారు చేసి సరసమైన ధరలకు విక్రయిస్తున్నాం.
గతంలో డిసిఎంఎస్‌ల పరిస్థితి ఎలా ఉండేది?
గత ప్రభుత్వం డిసిఎంఎస్‌లను పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైసిపి అధికారంలోకి వచ్చాక క్రమంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక అందుకనుగుణంగా కృషి చేస్తున్నాను. ముఖ్యంగా రైతులకు ఆధునిక సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌పై అవగాహన సదస్సులు నిర్వహించాం. ఇటీవల కాలంలో రాగులు, జొన్నలు వంటి మిల్లెట్స్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇటీవల విజయనగరం జిల్లా కేంద్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల జెసిలు, వ్యవసాయం, అనుబంధం శాఖల అధికారులతో ప్రత్యేక వర్కుషాప్‌ కూడా జరిగిన సంగతి తెలిసిందే.
రైతులకు ఏరకమైన సహకారం అందిస్తున్నారు?
రైతులకు ప్రస్తుతం విత్తనాలు, ఎరువుల పంపిణీ పంపిణీ చేస్తున్నాం. భవిష్యత్తులో విరివిగా పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. ఆధునిక యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు కూడా భవిష్యత్తులో పంపిణీ చేసే విధంగా డిసిఎంఎస్‌ను బలోపేతం చేస్తున్నాం. ఇందుకనుగుణంగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది.
డిసిఎంఎస్‌లలో కొనుగోలు చేయడం వల్ల లాభం ఏమిటి?
లాభ, నష్టాలతో సంబంధం లేకుండా సహకారం అందించడం డిసిఎంఎస్‌ లక్ష్యం. అందువల్ల తమ వద్ద విత్తనాలు లేదా ఎరువులు కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి తగ్గి, ఉత్పత్తి పెంచేందుకు అవకాశం ఉంటుంది. గత ఏడాది డిసిఎంఎస్‌ ద్వారా 200 మెట్రిక్‌ టన్నుల సీడ్‌, ఫెర్టిలేజర్స్‌ రైతులకు పంపిణీ చేశాం. ఈ ఏడాది కూడా అంతకు మించి విత్తనాలు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. భవిష్యత్తులో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు పంపిణీ చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉంది. ఇటీవల యూరియా వాడకం పెరుగుతున్న నేపథ్యంలో నానో యూరియా అందుబాటులోకి తెస్తున్నాం.
ప్రభుత్వ స్కూళ్లకు కూడా సహకారం అందిస్తున్నారా?
ఔను...! కేవలం వ్యవసాయరంగానికే కాకుండా అన్ని రంగాల్లోనూ తమ సేవలు విస్తరించాలనే సంకల్పంతో ఉన్నాం. అయితే, సిబ్బంది, ఆర్థిక పరిస్థితుల రీత్యా ప్రస్తుతం కొన్ని రంగాల్లో విస్తరిస్తున్నాం. వ్యవసాయంతోపాటు విద్యారంగం కూడా అత్యంత కీలకం కాబట్టి ప్రభుత్వ స్కూళ్లకు డిజిటల్‌ క్లాస్‌రూం మెటీరియల్‌ పంపిణీ కొనుగోలు చేసి, బహిరంగ మార్కెట్‌ కన్నా తక్కువ ధరకు విక్రయిస్తున్నాం. ఇప్పటి వరకు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సుమారు 75స్కూళ్లకు డిజిటల్‌ క్లాస్‌ రూంలకు అవసరమైన ప్రొజెక్టర్‌, మోనిటర్‌, సిపియు తదితర సామగ్రి ఓపెన్‌ మార్కెట్‌ ధరలపై రూ.50 తగ్గించి అందజేశాం. గత ఏడాది కణపాక యూత్‌ హాస్టల్‌లో డిఆర్‌డిఎ ఆధ్వర్యాన నిర్వహించిన టెక్స్‌టైల్‌ శిక్షణలో తమ వంతు భాగస్వామ్య మయ్యాం.
పోషకాహారాలు ఉత్పత్తి చేస్తున్నారా?
ఇటీవల కాలంలో మిల్లెట్స్‌, ఆర్గానిక్‌ బెల్లంతో డిసిఎంస్‌ తరపున తిఉబండారాలు తయారు చేస్తున్నాం. వాస్తవవానికి ఇటువంటి ప్రయత్నం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. భవిష్యత్తులో సిబ్బంది, ఇతర అవకాశాలను పెంపొందించుకుని మిల్లెట్స్‌తో తయారుచేసిన తినుబండారాలను మరింత ఎక్కువగా తయారు చేయడం ద్వారా ఇటు రైతులకు మార్కెట్‌ సదుపాయం, వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
ఆహార ఉత్పత్తులు ఎవరికి పంపిణీ చేస్తున్నారు?
ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లలో పిల్లలకు ప్రభుత్వం తరపున అందించే న్యూట్రీషన్‌ ఫుడ్‌ డిసిఎంస్‌ ద్వారా తయారుచేసి కొంతమేర పంపిణీ చేస్తున్నాం. ఇందుకోసం రాగులు, జీడి, బెల్లం వంటివి రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రణాళిక తయారు చేశాం. వర్కింగ్‌ క్యాపిటల్‌ తక్కువగా ఉండడం వల్ల ప్రయోగాత్మకంగా తొలుత పరిమితమైన ఉత్పత్తులను కొనుగోలు చేసి, కొన్ని శాఖలు, సంస్థలకు మాత్రమే సప్లయి చేయాలని, ఆ తరువాత క్రమంగా విస్తరించాలని భావిస్తున్నాం.