
ప్రజాశక్తి-నందిగామ
ఇక నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలోనే మిర్చి కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలుపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు, ట్రేడర్స్‌తో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొన్నటి వరకు కోల్డ్ స్టోరేజ్‌ల వద్ద మిర్చి కొనుగోలు జరిగేదని, రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజ్ వద్ద నిల్వ చేసుకుంటూ ట్రేడర్స్‌కు అమ్ముకునే వారని చెప్పారు. కొంతమంది మధ్యవర్తులు, దళారుల కారణంగా రైతులు నష్టపోవాల్సి వచ్చేదని, ఇటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధ్వర్యంలోనే మిర్చి కొనుగోలు జరిగేలా చర్యలు చేపట్టే విధంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జెడి శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్, ఎడియం మంగమ్మ, డిడి లావణ్య తదితరులు పాల్గొన్నారు.