Nov 28,2022 23:59

మార్కెట్‌ యార్డును పరిశీలిస్తున్న ఎంపిడిఒ వెంకన్నబాబు

ప్రజాశక్తి - కొత్తకోట:మేజర్‌ పంచాయతీ కొత్తకోటలో మార్కెట్‌ యార్డును మోడల్‌ యార్డ్‌గా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రావికమతం ఎంపీడీవో వెంకన్నబాబు తెలిపారు. సోమవారం ఆయన స్థానిక మార్కెట్‌ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్‌ యార్డుకు కావాల్సిన వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదంటూ పలువురు గ్రామస్తులు తమ దృష్టికి తెచ్చారని, దీనిపై తొందరలోనే ఒక ప్రణాళిక తయారు చేసి మార్కెట్‌ యార్డులో సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పేర్కొన్నారు. ఇప్పటికే దుకాణ సముదాయాల నిర్మాణాలకు నాబార్డ్‌ నిధుల నుంచి రూ.15లక్షలు మంజూరు కాగా మ్యాచింగ్‌ గ్రాండ్‌గా పంచాయతీ నుంచి మరో రూ.3 లక్షలు నిధులు సమకూరుస్తున్నట్టు తెలిపారు. మార్కెట్‌ యార్డ్‌ అభివృద్ధికి ఆక్రమణలు కూడా ఆటంకంగా మారాయని వాటిని తొలగించేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. కొత్తకోటతో పాటు మరో 20 గ్రామాల ప్రజలకు ఆరోగ్యవంతమైన సరుకులు అందించే విధంగా మోడల్‌ మార్కెట్‌ యార్డ్‌ను నిర్మిస్తామన్నారు.ప్రస్తుతం మార్కెట్‌ యార్డులో ప్రమాదకరంగా శిధిలావస్థలో ఉన్న భవనాలను తొలగించేందుకు లేదా మరమ్మతులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని గ్రామ సర్పంచ్‌ కోన లోవరాజు, ఉపసర్పంచ్‌ పందల దేవా ఎంపీడీవోను కోరారు. పంచాయతీ తీర్మానం చేసి తమకు అందజేయాలని ఎంపీడీవో సూచించారు. ఆయన వెంట పంచాయతీ ఈవో కృష్ణమోహన్‌, ఎంపీటీసీ పూడి దేవ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు