Sep 16,2023 00:33

ప్రజాశక్తి - నిజాంపట్నం
మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నూతన పాలవర్గ సభ్యులు కలిసికట్టుగా కృషి చేద్దామని ఎఎంసి చైర్మన్ పందరబోయిన బసవపున్నారావు అన్నారు. కూచినపూడి మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ సమావేశంను శుక్రవారం నిజాంపట్నంలో ఆయన అధ్యక్షతన నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, వైసీపీ నాయకులు మోపిదేవి హరనాథ్ బాబు, జడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య సహకారంతో మార్కెట్ యార్డ్ పరిధిలోని రైతులకు మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. కూచిపూడి మార్కెట్ యార్డ్ పరిధిలోని పల్లపట్లలో నిరుపయోగంగా ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలలో నూతన గొడౌన్ నిర్మించేందుకు ప్రపోజల్‌ను ఎంపీ మోపిదేవికి దృష్టికి తీసుకువెళుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు కట్టా పోలేరమ్మ, గంగుల వెంకట రత్నప్రసాద్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.